- పాల్గొననున్న ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి
- నల్గొండ, ఖమ్మం జిల్లాల పొలాలకు నీళ్లు
- రెండు ఉమ్మడి జిల్లాలో ఊపందుకోనున్న సాగు
- 537.40 అడుగులకు చేరిన నాగార్జునసాగర్ నీటి మట్టం
నల్గొండ, వెలుగు : నాగార్జున సాగర్జలాశయం నిండుకుండను తలపిస్తోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద వచ్చిచేరుతుండడంతో ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 590 అడుగులు కాగా, గురువారం సాయంత్రం 6 గంటల వరకు 537.40 అడుగులకు చేరుకుంది. వరద పెరుగుతుండడంతో వానాకాలం పంటల సాగు కోసం శుక్రవారం రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వకు నీటి విడుదల చేయనున్నారు.
ఇరిగేషన్ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి నీటిని విడుదల చేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి నాగార్జునసాగర్‌కు 3.20 గంటలకు చేరుకుంటారు. 3.40గంటలకు సాగర్ ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీటి విడుదల చేస్తారు.
నాలుగైదు రోజుల్లో ఫుల్లు...
కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి 3.50 లక్షల క్యూసెక్కులు, నారా యణపూర్ నుంచి 3.25 లక్షలు, జూరాల నుంచి 3.03 లక్షలు, తుంగభద్ర నుంచి 1.80 లక్షల క్యూసెక్కులు, శ్రీశైలం నుంచి 5.18 లక్షల క్యూసెక్కుల వరద విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదలుతున్నారు. ప్రాజెక్టు 10 గేట్లు 18 మీటర్ల మేర ఎత్తి సాగర్‌లోకి వదులుతున్నారు.
గురువారం సాయంత్రం 6 గంటల వరకు శ్రీశైలం నుంచి సాగర్‌కు 3,69,866 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. సాగర్‌నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలు కాగా, ప్రస్తుతం182.9534 టీఎంసీల నీరుంది. ఇన్‌ఫ్లో భారీగా వస్తుండడంతో రెండు, మూడు రోజుల్లో ప్రాజెక్టు నిండిపోయే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
ఊపందుకోనున్న పంటల సాగు..
మొన్నటి వరకు సరైన వానలు లేక ఉమ్మడి నల్గొండ, ఖమ్మ జిల్లాల్లో పంటల సాగు గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా వరి, పత్తి, కంది, పెసర, పండ్ల తోటలు, కూరగాయాల సాగు విస్తీర్ణం తగ్గిందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇటీవల కురిసిన వర్షాలతో బోరుబావుల కింద అక్కడక్కడా వరి, పత్తి, అపరాల పంటలు సాగు చేశారు. కానీ, సాగర్ ఆయకట్టుపై ఆధారపడ్డ మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, ఖమ్మం జిల్లాలో పంటల సాగు గణనీయంగా తగ్గింది.
ఇక ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కింద ఆధారపడ్డ నల్గొండ జిల్లాలో పత్తి తప్పా వరి సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. మాధవరెడ్డి ప్రాజెక్టు కింద ఎక్కువ భాగం బోరుబావులు, చెరువులు ఉండడంతో వరిపై రైతులు ఆశలు వదలుకున్నారు. శుక్రవారం నీటి విడుదల చేస్తుండడంతో సాగర్, మాధవరెడ్డి ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని చెరువులు మళ్లీ కళకళాడునున్నాయి.
ఇప్పటి వరకు సాగైన పంటల విస్తీర్ణం..
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో అన్ని రకాల పంటల కలిపి ఈ వానాకాలంలో 27,81,593 ఎకరాలు సాగు చేయాల్సి ఉండగా, కేవలం 16,86,111 ఎకరాలు మాత్రమే సాగైంది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. ఒక్క భద్రాచలం జిల్లాలోనే 89 శాతం మేర పంటలు సాగయ్యాయి. ఈ మూడు జిల్లాలో వరి సాగు విస్తీర్ణం 13,65,482 ఎకరాలకు 4,47,134 ఎకరాలు మాత్రమే సాగైంది.
పత్తి 10,47,441 ఎకరాలకు 9,41,920 ఎకరాలు సాగైంది. అపరాలు, పండ్ల తోటలు, కూరగాయాల సాగు అంతంతమాత్రంగానే సాగు చేశారు. ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం ఆయిల్ఫామ్ సాగు గతంతో పోలిస్తే పెరిగింది.
గోదావరి బేసిన్లో ఇలా..
గోదావరి బేసిన్లో వరద కాస్త తగ్గుముఖం పట్టింది. మొన్నటిదాకా భద్రాచలం వద్ద 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వెళ్లగా.. ఇప్పుడు 8.41 లక్షలకు తగ్గింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ నుంచి 3,62,685 క్యూసెక్కులు, సమ్మక్క సాగర్ నుంచి 6,26,950 క్యూసెక్కులు, సీతమ్మ సాగర్ నుంచి 8,07,593, భద్రాచలం నుంచి 8,41,262 క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతున్నది. మరోవైపు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 40,786 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది.
ఎడమ కాల్వకు నీటి విడుదల ఇలా..
సంవత్సరం తేదీ
2013 ఆగస్టు 2
2014 ఆగస్టు 6
2015 అక్టోబర్ 17
2016 ఆగస్టు 24
2017 అక్టోబర్ 31
2018 ఆగస్టు 24
2019 ఆగస్టు 12
2020 ఆగస్టు 8
2021 ఆగస్టు 2
2022 ఆగస్టు 28
2023 –
2024 ఆగస్టు 2
జిల్లాల వారీగా పంటల సాగు విస్తీర్ణం వివరాలు..
జిల్లా పేరు పంటల సాగు సాగైన విస్తీర్ణం (ఎకరాల్లో)
నల్గొండ 11,50,000 8,01,848
సూర్యాపేట 5,63,309 1,54,781
ఖమ్మం 5,96,662 3,07,382
భద్రాచలం 4,71,622 4,22,120