2028 నాటికి ఏఐ రంగంలో 28 లక్షల ఉద్యోగాలు: దావోస్ లో మంత్రి నారా లోకేష్

2028 నాటికి ఏఐ రంగంలో 28 లక్షల ఉద్యోగాలు: దావోస్ లో మంత్రి నారా లోకేష్

దావోస్ పర్యటనలో భాగంగా ఏఐపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్. ఈ సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి లోకేష్.2028 నాటికి భారత ఏఐ రంగంలో 28లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రిపోర్ట్ ప్రకారం జనరేటివ్ ఎఐ ప్రస్తుతం ప్రపంచ జీడీపీలో 7 శాతం ఉందని...  ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ అంచనా ప్రకారం 2030 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏఐ 19.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రభావాన్ని చూపబోతోందని అన్నారు. వ్యాపార కార్యకలాపాలు, ఉత్పత్తులు, సేవలను మెరుగుపర్చడంలో ఎఐ వినియోగానికి భారీఎత్తున పెట్టుబడులు రానున్నాయని అన్నారు లోకేష్. 

జపాన్ లో ఎఐ వినియోగం ద్వారా  విపత్తుల సమయంలో ప్రతిస్పందన సమయాన్ని 50శాతం తగ్గించే ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడమేగాక, అంచనా ఖచ్చితత్వం 30శాతం మెరుగైందని అన్నారు. యుఎస్ లో ఏఐ ఆధారిత మెరుగైన వాతావరణ అంచనా వ్యవస్థతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎఐ అప్లికేషన్లను వినియోగిస్తున్నారని... దక్షిణ కొరియా, సౌదీ అరేబియా వంటి అనేక దేశాలు పట్టణ ప్రణాళిక, రవాణా, ఎనర్జీ రంగాల్లో ఎఐ వినియోగంతోపాటు ఎఐ ఆధారిత నగరాలను నిర్మిస్తున్నాయని అన్నారు. 

సింగపూర్ లో ట్రాఫిక్ రద్దీని అంచనా వేయడానికి, సులభతరమైన ట్రాఫిక్ పరిష్కారాల కోసం ఎఐ ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని.. దీనిద్వారా పీక్ అవర్ ఆలస్యాన్ని 20శాతం తగ్గించడమేగాక డ్రైవింగ్ వేగం 15శాతం మెరుగుపడిందని అన్నారు.