
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 64,721 కోట్లు ఖర్చవుతుందని.. వచ్చే మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. అమరావతి నిర్మాణానికి 30 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాజీ సీఎం జగన్.. ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించారని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం కోసం బహుళ పక్ష ఏజెన్సీలు, భూములు అమ్మడం, లీజుల ద్వారా నిధులు సేకరిస్తామని చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు.
అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ)లో ఇళ్లు, భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్,ఎల్పీఎస్ మౌళిక సదుపాయాల అభివృద్ది కోసం 64,721.48 కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ నిధులను వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నామని.. బహుళ పక్ష ఏజెన్సీలు, బ్యాంకుల నుండి లోన్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంటులను పొందడం ద్వారా నిధుల సేకరిస్తున్నామని తెలిపారు. రైతులకు అభివృద్ది చేసిన ప్లాట్లను దశల వారీగా మూడేళ్లలో అప్పగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
2019-24 మధ్య విధానపరమైన అనిశ్చితుల కారణంగా ఈ ప్రక్రియలో జాప్యం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీద నమ్మకంతో 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలు భూమిని రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని.. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానిగా అమరావతి ఉండాలని సీఎం ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేశారని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చులో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కలిసి 13,400 కోట్లు రుణం ఇస్తున్నాయని వివరణ ఇచ్చారు.
ALSO READ | బనకచర్ల వివాదం..శ్రీశైలంలోని నిల్వ నీళ్లన్నీ తెలంగాణకే ఉండాలి
కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు 5 వేల కోట్లు లోన్ ఇస్తుంది. హడ్కో నుంచి రూ.11000 కోట్లు రుణం రెండు మూడు రోజుల్లో వస్తుంది. కేంద్రం గ్రాంట్ కింద మరో రూ.1560 కోట్లు ఇస్తుంది. అమరావతి లోపల భూములు అమ్మడం, లీజు ద్వారా అలాగే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో తక్కువ వడ్డీకి లోన్ తీసుకోవడం ద్వారా మిగిలిన నిధులు సమీకరిస్తామని మంత్రి నారాయణ అసెంబ్లీలో వెల్లడించారు. అమరావతిలో 106 ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగ సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటుచేసేందుకు సిద్దంగా ఉన్నాయని చెప్పారు.
టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభించేందుకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు ఇచ్చేందుకు అథారిటీ అనుమతి తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. అమరావతిలో ట్రంక్ రోడ్లు(మెయిన్ రోడ్లు) 165 అడుగులు,185 అడుగులతో రెండేళ్లలో పూర్తి చేస్తాం.. ఎల్పీఎస్ రోడ్లు మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. సగానికి పైగా నిర్మాణం జరిగిన అధికారుల భవనాలు ఏడాదిన్నరలో.. మిగతావి రెండేళ్లు, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు.
అమరావతి నిర్మాణానికి 30 వేల ఎకరాలు కావాలని జగన్ ఇదే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ ప్రభుత్వం మారగానే ప్లేటు ఫిరాయించి మూడు ముక్కలాట ఆడి ఎక్కడా రాజధాని ఏర్పాటు చేయలేదు మండిపడ్డారు. గత ఐదేళ్లలో రాజధానికి భూములిచ్చిన రైతులను నానా ఇబ్బందులు పెట్టారు. శాడిజంతో కక్ష సాధింపుతో ఆర్ -5 జోన్ చేసి 50 వేల మందికి ఒక సెంట్ భూమి ఇచ్చారని మండిపడ్డారు. వారికి కూడా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాం.. వేరొక చోట స్థలం కేటాయించి అమరావతి భూములను రాజధాని కోసం తీసుకుంటామని స్పష్టం చేశారు.