రైతులు ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తే అధిక దిగుబడి

రైతులు ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తే అధిక దిగుబడి
  • కేంద్ర మంత్రి నిముబెన్​ జయంతిబాయి బంబానియా
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటన

రేగొండ, వెలుగు : ఆధునిక పద్ధతుల్లో రైతులు వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ సహాయ శాఖ మంత్రి నిముబెన్​జయంతిబాయి బంబానియా సూచించారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అంగన్​వాడీ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు. అనంతరం రూపిరెడ్డిపల్లిలో రైతు సహకారం సంఘంలో రైతులతో మాట్లాడారు. రైతులు భూసారానికి అనుగుణంగా పంటలు సాగు చేయాలని పేర్కొన్నారు. 

రైతుల సౌకర్యార్థం కేంద్ర సురక్షిత నిల్వ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కిసాన్​ సమ్మాన్​నిధి ద్వారా రైతులకు ఏడాదికి రెండు సార్లు ఆర్థికసాయం చేస్తున్నట్టు చెప్పారు. రైతుల అభివృద్ధి కోసం కేంద్రం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం యాస్పిరేషన్​ బ్లాక్​లను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ సెక్రటరీ ఖుష్భూ, జిల్లా కలెక్టర్ రాహుల్​శర్మ తదితరులు పాల్గొన్నారు.

రామప్పను సందర్శించిన కేంద్రమంత్రి

వెంకటాపూర్ (రామప్ప) : రామప్ప టెంపుల్ ను కేంద్ర సహాయ మంత్రి నిముబెన్ జయంతిబాయ్ బంబానియా సందర్శించి పూజలు చేశారు. ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ బొకే అందించి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. గైడ్ ద్వారా రామప్ప చరిత్ర శిల్పకళా విశిష్టతను, నైపుణ్యాన్ని కేంద్రమంత్రి తెలుసుకున్నారు.