త్వరలో రైతుబంధు నిధులు విడుదల చేస్తామని వెల్లడి
మహబూబ్‌నగర్, వెలుగు: రాష్ట్రంలో వరి సాగు తగ్గించుకోవాలని రైతులకు మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. ప్రత్యామ్నాయంగా డిమాండ్ ఉన్న ఇతర పంటలు సాగు చేయాలని చెప్పారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు వరి తప్ప ఏ పంట వేసినా లాభం ఉంటుందని తెలిపారు. ఇది పెట్టుబడి ఖర్చులు, మార్కెట్ ధరల అధ్యయనం తర్వాతే చెప్తున్నానని అన్నారు. రైతులు పడే కష్టం, పెట్టే ఖర్చులతో పోలిస్తే వ్యవసాయంలో వరి కంటే ఏ ఇతర పంట వేసినా లాభం ఎక్కువగా వస్తుందని పేర్కొన్నారు.
వచ్చేనెల మొదటి లేదా రెండో వారంలో రైతు బంధు నిధులు విడుదల చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. అందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆర్థిక శాఖను ఆదేశించారని తెలిపారు. పాలమూరులో, రాష్ట్రంలో ఎక్కడ చూసినా వడ్ల కుప్పలు, వడ్ల కొనుగోలు కేంద్రాలు కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్, సాగు నీళ్లు ఇస్తోందని, సెంటర్లు పెట్టి వడ్లు కొంటోందని, పెట్టుబడి సాయం ఇస్తోందని అన్నారు. దీంతో రైతులకు వరిసాగు సులభతరంగా మారిందని, అందుకే రైతులు వరి వేసేందుకే మొగ్గుచూపుతున్నారని కామెంట్ చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చే నీళ్లు, విద్యుత్ ఆసరాగా చేసుకుని వాణిజ్య పంటలవైపు మొగ్గు చూపాలని కోరారు. రాష్ట్రంలో పల్లి సాగు విస్తీర్ణం 3 లక్షల ఎకరాలు దాటిందన్నారు. దేశంలో తెలంగాణ పల్లికి చాలా డిమాండ్ ఉందని చెప్పారు. తెలంగాణ, ఏపీ మధ్య నీటి పంచాయితీని కేంద్రం ఎనిమిదేండ్లుగా పరిష్కరించలేకపోతోందని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కృష్ణానది నీటి వాటా తేలక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి కాకుండా కొందరు కేసులు వేసి ఆపుతున్నారని మండిపడ్డారు. పాలన మరింత చేరువయ్యేందుకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు.