వనపర్తి, వెలుగు : కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్, కర్ణాటకలో వృద్దులకు రూ.200, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో రూ.600 పింఛన్ మాత్రమే ఇస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ఆదివారం వనపర్తి పట్టణంలోని పలు కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు ప్రతి నెలా పింఛన్లు అందించడంతో వారు ఆత్మవిశ్వాసంతో బతుకుతున్నారని పేర్కొన్నారు. రెండేండ్లు కరోనాతో నష్టపోయామని, మిగిలిన ఏడున్నరేండ్లలో వ్యవసాయం, ఆర్థిక పురోగతి, మిషన్ భగీరథ, ఐటీ రంగాల్లో దేశంలోనే తెలంగాణను మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు.
మరోసారి బీఆర్ఎస్ కు అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించవచ్చన్నారు. అభివృద్ధికి ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు. మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మంత్రి కూతురు డాక్టర్ ప్రత్యూష, రీజినల్ అథారిటీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల అశోక్ పాల్గొన్నారు. వనపర్తి ఐదో వార్డులోని వశ్య తండాలో మంత్రి కూతురు తేజశ్విని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వనపర్తిని అభివృద్ధి చేయడంతో పాటు అన్ని రకాల విద్యాలయాలు ఏర్పాటు చేసిన మంత్రి నిరంజన్ రెడ్డికి మరో అవకాశం ఇవ్వాలని కోరారు.