వనపర్తి/ పెబ్బేరు, వెలుగు: రైతులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోందని మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైతుబంధుకు ఈసీ బ్రేక్ వేయడం కాంగ్రెస్ కుట్రగా పేర్కొన్నారు. పెబ్బేరు, ఖిల్లాఘన్పూర్ మండలాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. పెబ్బేరులోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం పెబ్బేరు సంత ప్రాంతంలో ఆరె కటికె సామాజికవర్గం వారితో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వైస్ ఎంపీపీ కోట్ల బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైశాఖపూర్ కు చెందిన కాంగ్రెస్ యువజన సంఘం నాయకులు, రిటైర్ఢ్ టీచర్ ఎల్లన్న గౌడ్ బీఆర్ఎస్లో చేరారు.
రోడ్డు విస్తరణలో ఇంటి జాగా కోల్పోయిన ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు బుచ్చయ్యను భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయరంగాన్ని నిలబెట్టేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చారన్నారు. కాంగ్రెస్ నేతలు పథకాలను ఆపగలరేమో కాని, కేసీఆర్ ప్రభుత్వాన్ని అడ్డుకోలేరని చెప్పారు. 2.5 కోట్ల రైతు కుటుంబాల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటమాడుతోందన్నారు. రాజకీయ లబ్ది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏమీ పట్టవని విమర్శించారు. అభివృద్ధిలో వనపర్తి నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చానని, అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలన్నారు.