వనపర్తి, వెలుగు : వనపర్తి సంపూర్ణ అభివృద్ధి కోసం తనకు మరో సారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను బీఆర్ఎస్అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డికోరారు. గురువారం ఆయన ఖిల్లా ఘనపురం మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. వనపర్తి నియోజకవర్గంలో అన్నీ ఉండాలన్న సంకల్పంతో పనిచేశానన్నారు. అన్ని మండలాలతో పాటు పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దామన్నారు. ఇంత అభివృద్ధి చేసిన తనకు ఓటు వేయకుంటే జరిగిన అభివృద్ధిని అవమానించినట్లేనని అన్నారు.
వనపర్తిలో ఇంటిగ్రెటీడ్ మార్కెట్, టౌన్ హాల్, బాలభవన్, ట్యాంక్ బండ్ పనులు పూర్తి చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్, తాగు, సాగునీరు కల్పించలేక పోయారని విమర్శించారు. 2014 కంటే ముందు కాంగ్రెస్ పాలన ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం లో సాగునీరు రావడంతో జోరుగా వ్యవసాయం సాగుతోందన్నారు. డిల్లీలో సూటుకేసుల కొద్ది డబ్బు ఇచ్చి వనపర్తి కాంగ్రెస్ టికెట్ కొన్నారని ఆ డబ్బంతా వనపర్తి ప్రజల నుంచి వసూలు చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థి మేఘా రెడ్డి సిద్ధం అవుతున్నాడని నిరంజన్ రెడ్డి విమర్శించారు.