వనపర్తి, వెలుగు : కాంగ్రెస్ పార్టీ మాటలు విని ఆ పార్టీకి ఓటేస్తే మళ్లీ చీకటిరాజ్యం వస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వనపర్తి మండలం చిట్యాలతో పాటు పలు గ్రామాల్లో దివంగత నేత డాక్టర్ బాలకిష్టయ్య కుమారుడు డాక్టర్ భూపేశ్తో కలిసి ప్రచారం నిర్వహించారు. తాను ఎంతో కష్టపడి సాగు నీళ్లు తీసుకొచ్చి రైతుల కాళ్లు కడిగానని, అదే విశ్వాసంతో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ గ్యారెంటీలకు ఎవరు వారెంటీ ఇస్తారని ప్రశ్నించారు.
ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కల్లోలాలు సృష్టిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న రూ.2016 ఫించన్ ను రూ.5 వేలకు పెంచుకోబోతున్నామని చెప్పారు. రైతు బంధును ఎకరాకు రూ.16 వేలకు పెంచుతామని తెలిపారు. భూమి లేని పేదలు మరణిస్తే కేసీఆర్ బీమా కింద రూ. 5 లక్షల ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రైవేట్ దవాఖానల్లోనే కాన్పులు జరిగేవని, రూ.50 వేల నుంచి రూ.లక్ష ఖర్చు చేయాల్సి వచ్చేదన్నారు.
హైదరాబాద్ లో ఉన్న వాటినన్నింటినీ వనపర్తి కి తెచ్చానని చెప్పారు. వ్యవసాయ, వ్యవసాయేతర వృత్తుల్లో ఉపాధి అవకాశాలు కల్పించామని, వలస పోయిన వారంతా తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యేగా తనకు మరో అవకాశం ఇవ్వాలన్నారు. చీమనగుంటపల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులతో పాటు మాజీ ఎంపీటీసీ తిరుపతయ్య బీఆర్ఎస్ లో చేరారు. జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, మెంటెపల్లి పురుషోత్తం రెడ్డి, జాతృ నాయక్, మాణిక్యం, చిట్యాల రాము, మధుసూదన్ రెడ్డి, వెంకట్రావు పాల్గొన్నారు.