వనపర్తి, వెలుగు: గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం జిల్లా కేంద్రంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ, ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కాలేజీ , అగ్రికల్చర్ మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్ లో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించారు. వనపర్తిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, టౌన్ హాల్, వ్యవసాయ మార్కెట్, గోదాములు, మిషన్ భగీరథ కింద ప్రతి రోజూ తాగునీటిని అందిస్తున్న ఘనత తమదేనన్నారు. వనపర్తి లో 30 ఏండ్లుగా పరిష్కారం కాని రోడ్ల విస్తరణ పనులను పూర్తి చేసినట్లు చెప్పారు.
వనపర్తి సమీపంలోని నాగవరం శివారులో ప్రతిష్టాత్మకంగా ఐటీ టవర్ నిర్మించనున్నట్లు తెలిపారు. 15 చెక్ డ్యాంలు నిర్మించామని, మరో 20 చెక్ డ్యామ్‌లకు ప్రపోజల్స్ పంపామని చెప్పారు. నియోజకవర్గంలో 1.25 లక్షల ఎకరాలకు లిఫ్ట్ ల ద్వారా సాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సహకార యూనియన్ సభ్యుడు తిరుమల మహేశ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, కౌన్సిలర్ నాగన్న యాదవ్ పాల్గొన్నారు.