నిజాయితీపరులైన ట్యాక్స్​పేయర్లకు న్యాయం చేశాం: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

నిజాయితీపరులైన ట్యాక్స్​పేయర్లకు న్యాయం చేశాం: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: ప్రజల కోసం.. ప్రజల చేత తీసుకొచ్చిందే ఈ బడ్జెట్ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రాలకు అత్యధిక నిధులు కేటాయించారన్న అపోజిషన్ పార్టీల విమర్శలను ఆమె ఖండించారు. ఎంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినా.. అపోజిషన్ పార్టీల నేతలు విమర్శిస్తూనే ఉంటారని కొట్టిపారేశారు. దేశాభివృద్ధిలో పన్ను చెల్లింపుదారుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. అలాంటి నిజాయితీపరులైన ట్యాక్స్ పేయర్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ తీసుకొచ్చినట్లు తెలిపారు. బడ్జెట్ తర్వాత ఓ నేషనల్ చానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. 

మధ్య తరగతి ప్రజల కష్టాలు చూశాం..

‘‘మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలది.. పేద, మధ్య తరగతి ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాం. అన్ని వర్గాలకు న్యాయం చేశాం. ట్యాక్స్ రిలీఫ్ విషయంలో ప్రధాని మోదీ ముందు నుంచి ఓ క్లారిటీతో ఉన్నారు. అందుకే.. ఇన్‌‌‌‌‌‌‌‌కమ్ ట్యాక్స్ రిబేట్ ఇవ్వగలిగాం. మోదీ ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు ఒకటే. ఏ స్టేట్‎ను తక్కువ.. ఎక్కువ చూసి చూడదు. ఘన చరిత్ర, అత్యధిక జనసాంద్రత ఉన్న బిహార్ రాష్ట్రానికి ఓ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టు కూడా అక్కర్లేదంటారా..?

 అక్కడి అవసరాల దృష్ట్యా గ్రీన్​ఫీల్డ్ ఎయిర్​పోర్టులతో పాటు మఖానా ఉత్పత్తిని పెంచేందుకు ప్రోత్పహించేలా బోర్డు ఏర్పాటుకు నిర్ణయించాం. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అంశం మా ఎజెండా కాదు.. అక్కడి ప్రజలకు మెరుగైన పాలన అందించడమే మా లక్ష్యం’’అని నిర్మలా సీతారామన్​స్పష్టం చేశారు. ఇరిగేషన్ రంగానికి బూస్ట్ ఇచ్చేందుకు వెస్ట్రన్ కోసి కెనాల్ ప్రాజెక్ట్​కు ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయించామన్నారు. 

అన్ని రాష్ట్రాల మాదిరిగానే బిహార్

అస్సాంలో యూరియా ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయించామని, అలా అని అక్కడ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయా..? అని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. బిహార్‎లో జన సాంద్రత ఎక్కువ అని, నలంద, రాజ్​గిర్ వంటి కల్చరల్ సెంటర్లు ఉన్నాయని, అందుకే ఆ రాష్ట్రాభివృద్ధిపై ఫోకస్ పెట్టామని స్పష్టం చేశారు. ‘‘బిహార్‎లో ఇప్పటిదాకా ఓ మంచి ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టు కూడా లేదు. దీనికి మనమంతా బాధ్యులం కాదంటారా..? వాళ్లకు ఓ ఎయిర్​పోర్టు కూడా ఇవ్వొద్దా..? స్థానికంగా పని దొరక్కపోవడంతో అక్కడివాళ్లంతా వలస వెళ్తుంటారు. వాళ్ల జీవితాలు బాగు చేయొద్దా?’’అని నిర్మల ప్రశ్నించారు.  

చేతిలో డబ్బులుంటేనే కదా.. ఏమైనా కొనేది..

తమ ప్రభుత్వం ఫోకస్ మొత్తం కన్జప్షన్‎పైనే ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. నిజాయితీగా ట్యాక్స్ కడ్తున్న ప్రతి ఒక్కరిని మోదీ ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. ‘‘మధ్య తరగతి ప్రజలకు అండగా నిలబడాలనేది మా ప్రభుత్వం లక్ష్యం. ఎప్పుడూ వాళ్ల చేతుల్లో డబ్బులు ఉండేలా చూస్తాం. పర్సులో డబ్బులున్నప్పుడే ఎవరైనా.. ఏమైనా కొనేందుకు ముందుకు వస్తుంటారు. నేను ఎక్కడికి వెళ్లినా వినిపించే పదం పన్ను చెల్లింపుల గురించి.. ‘మేం నిజాయితీగా ట్యాక్స్ కడ్తున్నం. దేశానికి సేవ చేస్తున్నం. మీరు మా కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు..?’ అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై ప్రధాని మోదీతో చర్చించి ఈ బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ఇచ్చాం’’ అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.