దేశం బాగుంది అంటే రోడ్లు బాగున్నట్లు కాదు.. దేశంలో అద్బుతమైన మౌలిక వసతులు, అద్బుతమైన రోడ్డు ఉంటే.. దేశం అభివృద్ధి చెందినట్లే అన్నారు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. 2023, జులై 8వ తేదీ ఉదయం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో.. ప్రధానమంత్రి మోదీతో కలిసి పాల్గొన్నారాయన. ఘతిశక్తి ప్రణాళికలో భాగంగా దేశంలో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందన్నారు మంత్రి.
ప్రధాని మోదీ సారధ్యంలో.. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను సమర్థవంతంగా పూర్తి చేసి.. జాతీయ రహదారులను అభివృద్ధి చేయటం జరిగిందన్నారు మంత్రి. మరో రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు నడుస్తున్నాయని.. రాబోయే కాలంలో రహదారుల విస్తరణలో తెలంగాణ ప్రత్యేక కారిడార్ గా రూపుదిద్దుకుంటుందన్నారు మంత్రి గడ్కరీ.
కరీంనగర్ టూ వరంగల్ జాతీయ రహదారిని 68 కిలోమీటర్ల పరిధిలో.. 2 వేల 150 కోట్లతో నాలుగు లైన్లగా విస్తరించటం ద్వారా మెగా టెక్స్ టైల్ పార్కు తోపాటు ఇండస్ట్రీయల్ కారిడార్ డెవలప్ అవుతుందన్నారు. అదే విధంగా నాగపూర్ – విజయవాడ కారిడార్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, హన్మకొండ, వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడ వరకు నాలుగు లైన్ల రహదారితో.. ఇండస్ట్రీయల్ కారిడార్ అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి. నాగపూర్ – విజయవాడ వయా తెలంగాణ మీదుగా వెళ్లటం వల్ల 178 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. గిరిజన జిల్లాల్లో సామాజిక, ఆర్థిక అభివృద్ధి పెరుగుతుందన్నారాయన.