న్యూఢిల్లీ: పెట్రోల్‌లో ఇథనాల్ వాటాను 20 శాతానికి పెంచాలన్న లక్ష్యాన్ని మరో రెండు నెలల్లో సాధిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖల మంత్రి నితిన్‌గడ్కరీ అన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే విధానాన్ని 2001లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. దీనివల్ల కాలుష్యం తగ్గుతుందని, పూర్తిగా బయో–ఇథనాల్‌తో నడిచే ఇంజన్లను తయారు చేయడాన్ని టాటా మోటార్స్, మహీంద్రా, మారుతీ సుజుకీ, హ్యుండై మోటార్స్ మొదలుపెట్టాయని అన్నారు. ప్రపంచంలో అత్యధిక కాలుష్యం గల 50 నగరాల్లో ఇండియా నుంచే 42 ఉన్నాయని వెల్లడించారు.
మనదేశం ఏటా పెట్రో ప్రొడక్టుల దిగుమతుల కోసం రూ.22 లక్షల కోట్లను ఖర్చు చేస్తోందని, వీటిని తగ్గించడానికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే విధానాన్ని ప్రధాని మోదీ 2023లో మొదలుపెట్టారని వివరించారు. మొదటిదశలోనే ఈ విధానాన్ని 15 నగరాల్లో అమలు చేశారు. చెరుకు, నూకలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇథనాల్ తయారు చేస్తారు. మనదేశం ఇంధన అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. 10 శాతం ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్‌ను 2022 జూన్‌లోనే సాధించామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.