తండాలను బాగు చేసింది కేసీఆరే : ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు

పాలకుర్తి, వెలుగు : సమైక్య పాలనలో వెనుకబడిన గిరిజన తండాలను బాగు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌‌‌‌దేనని పంచాయతీ రాజ్‌‌‌‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు చెప్పారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని సిరిసన్న గూడెం, కంబాలకుంట తండాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌‌‌‌ రాక ముందు తండాల పరిస్థితి ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో గుర్తు చేసుకోవాలని చెప్పారు. 

గతంలో తాగునీళ్ల కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచిన తండా మహిళలు ఇప్పుడు ఇంటి వద్దే మిషన్‌‌‌‌ భగీరథ నీటిని పట్టుకుంటున్నారన్నారు. విషజ్వరాలతో ఇబ్బందులు పడిన తండావాసులను గత ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదన్నారు. తమ తండాల్లో తమ రాజ్యం కోసం దశాబ్దాలుగా పోరాటం చేసినా కాంగ్రెస్‌‌‌‌ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌‌‌‌ ఇచ్చిన మాట ప్రకారం తండాలను పంచాయతీలుగా మార్చారని, లంబాడీలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారన్నారు. 

కేసీఆర్‌‌‌‌ మళ్లీ అధికారంలోకి వస్తే గిరిజన బంధుతో పాటు, రేషన్‌‌‌‌ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తామని, రూ.400లకే సిలిండర్‌‌‌‌ ఇస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌‌‌‌కు సీఎంగా మరో ఛాన్స్‌‌‌‌ ఇవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం వరంగల్‌‌‌‌ జిల్లా రాయపర్తి మాజీ ఎంపీపీ కంజర ఎల్లయ్యతో పాటు మరికొందరు మంత్రి సమక్షంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు.