- మంత్రి సీతక్క వెల్లడి
వరంగల్, వెలుగు : జీపీ నిధులను దారిమళ్లించి మీరే సర్పంచుల ఆత్మహత్యలకు కారణమయ్యారని కేటీఆర్‌పై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో సర్పంచులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. గ్రామ పంచాయతీలు ఇప్పటికీ ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తమన్నారు. త్వరలోనే సర్పంచులకు బిల్లులు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
శనివారం ఆమె హనుమకొండ కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. గ్రామ పంచాయతీల బిల్స్ గురించి కేబినెట్లో చర్చించి నిధులు విడుదల చేస్తామన్నారు. సర్పంచుల సమస్యలపై తాము అసెంబ్లీలో అనేకసార్లు ప్రస్తావించామని గుర్తుచేశారు. రాష్ట్రంలో సర్పంచుల చావులే లేవని కేటీఆర్ దబాయించారని మండిపడ్డారు.
గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన ఫండ్స్ ఇష్టారీతిన ఇతర అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు. చేయాల్సిన అన్యాయం చేసి వెయ్యి గొడ్లను తిన్న రాబందు తీర్థయాత్రలకు వెళ్లినట్లు కేటీఆర్ నీతి కథలు చెప్తున్నాడని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ సర్కారు ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్లిందని.. జీతాలు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా చేశారని విమర్శించారు.