బీఆర్ఎస్ కాళ్లలో క‌ట్టెలు పెట్టినా ఏది ఆగదు: మంత్రి పొంగులేటి

బీఆర్ఎస్ కాళ్లలో క‌ట్టెలు పెట్టినా ఏది ఆగదు: మంత్రి పొంగులేటి

హైదరాబాద్: ఈనెల చివ‌రి నాటికి రాష్ట్రంలోని ప్రతి నియోజ‌క‌వ‌ర్గానికి తొలివిడ‌తగా 3,500  నుంచి 4 వేల ఇండ్ల మంజూరు చేయ‌బోతున్నామ‌ని రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార  పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రక‌టించారు. వచ్చే నాలుగేండ్లలో 20 ల‌క్షల ఇండ్లకు త‌గ్గకుండా నిర్మిస్తామ‌ని తెలిపారు. కులాలు, మ‌తాలు, ప్రాంతాలు, పార్టీలు, ఎలాంటి తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిర‌మ్మ ఇండ్లు ఇవ్వడ‌మే ప్రభుత్వ ఆశ‌య‌మ‌న్నారు. ఎలాంటి  భేష‌జాల‌కు పోకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా, నిధులు అడిగి తీసుకుంటామ‌ని తెలిపారు. గ‌త ప్రభుత్వం పేద‌వాడి గురించి క‌నీస ఆలోచ‌న చేయ‌లేద‌ని, పైన ప‌టారం, లోప‌ల లోటారం అన్నట్లుగా వ్యవ‌హ‌రించింద‌ని విమ‌ర్శించారు.

ALSO READ | గుడ్ న్యూస్: అక్టోబర్ నెలాఖరులో ఇందిరమ్మ ఇళ్లు

 గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన 144 మంది ల‌బ్ధిదారుల‌కు హైద‌రాబాద్ జిల్లా క‌లెక్టరేట్‎లో  మంత్రి పొన్నం ప్రభాక‌ర్‌తో క‌లిసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప‌ట్టాలు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ‌పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్ని ఆర్థిక ఇబ్బందుల  ఎదురైనా ప్రతిప‌క్షాలు కాళ్లల్లో క‌ట్టెలు పెడుతూ అభివృద్ది సంక్షేమాన్ని అడ్డుకోవాల‌ని ప్రయ‌త్నించినా ఏదీ ఆగ‌ద‌న్నారు. పేద‌వాడి క‌న్నీరు తుడ‌వ‌డ‌మే ఈ ప్రభుత్వ ల‌క్ష్యమని స్పష్టంచేశారు. ప్రతిపక్షాల కాకి గోల వ‌ల్ల తమ ప్రభుత్వానికి వ‌చ్చే న‌ష్టమేమీ లేదన్నారు. మూసీ ప‌రివాహ‌క ప్రాంత ప్రజ‌ల‌కు ఇండ్లు, ఉద్యోగం, ఉపాధి, క‌ల్పిస్తే బీఆర్ఎస్ ఓర్చుకోలేకపోతోంద‌ని ఫైర్​అయ్యారు. 

నిర్మాణాత్మక సలహాలివ్వండి: పొన్నం

ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసిన ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాక‌ర్ అన్నారు. బాధ్యత గల ప్రతిపక్షం అయితే ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని సూచించారు. మూసీ పునరుజ్జీవంపై అనేక అభాండాలు వేస్తున్నారు.. అక్కడున్న పేదవారిని అక్కడే వదిలేస్తారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసి 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ బకాయిలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి పరిపాలన ఎలా చేయాలో ప్రతిపక్షాలకు ఎలా గౌరవం ఇవ్వాలో తెలుసునని పొన్నం తెలిపారు.