పాలకుర్తి, వెలుగు : బీఆర్‌ఎస్ పాలనతో భవిష్యత్ ఉంటుందని మంత్రి, పాలకుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి తనను మరోమారు గెలిపించాలని కోరారు. పదేళ్ల పాలనలో గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు.
కేసీఆర్ ఆలోచనలకు రూపమే ఇంటింటికీ మిషన్ భగీరథ పథకమని చెప్పారు. ఓటు వేసే ముందు ప్రతిఒక్కరూ తమ భవిష్యత్ గురించి ఆలోచించాలని సూచించారు. 60 ఏళ్ల కాంగ్రెస్, పదేళ్ల బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని గ్రామాలకు క్వాలిటీ రోడ్లు, కరెంటు వచ్చిందని, పచ్చటి పొలాలతో గ్రామాలు కనిపిస్తున్నాయని చెప్పారు.
బీఆర్‌ఎస్ గెలవగానే వృద్ధుల పెన్షన్‌ను రూ. 5 వేలకు, రైతు బంధు రూ. 16 వేలకు పెంచనున్నట్లు చెప్పారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ ఎప్పుడైనా కనపడిందా ? ప్రజల బతుకుల గురించి ఆమెకు తెలుసా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు తెలియని కాంగ్రెస్ క్యాండిడేట్‌కు డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మంత్రికి బతుకమ్మలు, కోలాటాలతో స్వాగతం పలికారు. అలాగే రాయపర్తి మండలం కాట్రపల్లి సర్పంచ్ భువనగిరి ఎల్లయ్య గురువారం బీఆర్‌ఎస్‌లో చేరగా, ఆయనకు మంత్రి కండువా కప్పి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ లీడర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.