2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనూహ్య తీర్పునిచ్చారు. టీడీపీ, జనసనేన, బీజేపీ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన ప్రజలు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు కూడా ఇవ్వలేదు.ఈ ఫలితంతో ఖంగు తిన్న వైసీపీ, ఆ షాక్ నుండి ఇంకా బయటకి రాలేకపోతోంది. ఇంతలో తొలి అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం ప్రమాణస్వీకారానికి మాత్రమే హాజరయ్యి తర్వాత రోజు సమావేశాలకు హాజరు కాలేదు. అంతా అనుకున్నట్టుగానే జగన్ అసెంబ్లీకి రాలేదు.
అయితే, తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తే అసెంబ్లీకి వస్తానంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి జగన్ లేఖ రాసారు. ఈ లేఖ అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 10శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో లేదని పేర్కొన్నారు జగన్.ఈ లేఖపై స్పందించిన మంత్రి పయ్యావుల కేశవ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్ తన పార్టీ పక్ష నేతగా మాత్రమే ఉంటారని, ప్రతిపక్ష నేత హోదా రాదని తేల్చి చెప్పారు పయ్యావుల. స్పీకర్ బెదిరించేలా జగన్ లేఖ రాయటం సరికాదని అన్నారు. లేఖ రాయమని జగన్ కు ఎవరు సలహా ఇచ్చారో, ఆయన వెనక ఏ సలహాదారు ఉన్నారో అర్థం కావట్లేదని అన్నారు. ప్రజాతీర్పును జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. జగన్ రూల్స్ బుక్ చదువుకొని రావాలని అన్నారు పయ్యావుల కేశవ్. ఈ క్రమంలో జగన్ ప్రతిపక్ష నేత హోదా దక్కటం అసాధ్యమనే అనిపిస్తోంది. మరి, జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.