నాలుగేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లిస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

కూసుమంచి, వెలుగు: అర్హులైన పేదలకు రాబోయే నాలుగు ఏండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.సోమవారం కూసుమంచిలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్​ హౌస్​ నిర్మాణాన్ని, దుబ్బతండలో 29 మంది డబుల్​ బెడ్​ రూమ్​లను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్​రెడ్డి, ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 25 లక్షల 60 వేల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించామని,  ప్రజలు మార్పు కావాలని ఆకాంక్షించి 2023 ఎన్నికల సమయంలో ఇందిరమ్మ రాజ్యానికి పట్టం కట్టారని అన్నారు.

పేద ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మొదటి సంవత్సరంలోనే నాలుగు లక్షల 50 వేల ఇండ్లు నిర్మించాలని దృఢ సంకల్పంతో ఉన్నామన్నారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకు జనవరి 26 నుంచి 4 పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేశ్​, హౌజింగ్ పీడీ బి. శ్రీనివాసరావు, పీఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, డీపీఓ ఆశాలత, ఇంచార్జ్ తహసీల్దార్ కరుణశ్రీ, మార్కెట్ కమిటీ చైర్మన్ సీతారాములు, అధికారులు , నాయకులు తదితరులు పాల్గొన్నారు.