- ఇల్లెందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి పొంగులేటి
ఇల్లెందు, వెలుగు : ఇల్లెందు మున్సిపల్ పాలకవర్గం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు పాలకవర్గ నిబద్ధతకు నిదర్శనమని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మున్సిపల్ కౌన్సిల్సమావేశ మందిరంలో నిర్వహించిన పాలకవర్గం చివరి కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇల్లెందు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ కలిసికట్టుగా మున్సిపాలిటీని మూడుసార్లు రాష్ట్రస్థాయిలో, రెండుసార్లు జాతీయస్థాయిలో ఉత్తమ మున్సిపాలిటీగా నిలబెట్టడం అభినందనీయమన్నారు. పాలకవర్గంలో గడిచిన ఐదేళ్లలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధిలో అన్ని మున్సిపాలిటీలకు దీటుగా ముందుకు నడిచారన్నారు.
చివరి సమావేశంలో కౌన్సిలర్లు చెప్పిన ప్రతీ సమస్యను, పట్టణంలో మధ్యలో నిలిచిన అభివృద్ధి పనులను నూటికి నూరు శాతం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని తెలిపారు. పట్టణంలోని 24 వార్డుల్లో కౌన్సిల్ సభ్యుల అభ్యర్థుల మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఎస్పీ, కలెక్టర్ చొరవ తీసుకోవాలని సూచించారు. సింగరేణి ప్రాంతమైన ఇల్లెందులో మరోసారి 76 జీవోను తీసుకొచ్చి ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామన్నారు. అనంతరం ఐదేళ్లపాటు ప్రజలకు సేవలు అందించిన పాలకవర్గాన్ని శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
కంటతడి పెట్టుకున్న కౌన్సిలర్
గత ప్రభుత్వం హయాంలో తన వార్డు పట్ల మాజీ ఎమ్మెల్యే వివక్షత చూపి అభివృద్ధిని అడ్డుకున్నారని ఇల్లెందు మున్సిపాలిటీ 19వ వార్డు కౌన్సిలర్ పత్తి స్వప్న మంత్రి పొంగులేటి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులపై కక్షపూరితంగా వ్యవహారించారని కంటతడి పెట్టుకున్నారు. తర్వాత ఎమ్మెల్యేగా కోరం కనకయ్య గెలిచాక తన వార్డులో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. దీనికి మంత్రి స్పందిస్తూ వెంటనే ఆ వార్డులోని పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం ఇల్లెందు మండల పరిధిలో రూ.40 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. పట్టణంలోని డిజిటల్ లైబ్రరీ, బుగ్గ వాగు సుందరీకరణ, లలితాపురం నుంచి సుభాష్ నగర్ వరకు బీటీ రోడ్డు, గోవింద్ సెంటర్ నుంచి చెరువుగట్టు వరకు సెంట్రల్ లైటింగ్, డివైడర్, స్విమ్మింగ్ పూల్, పీహెచ్సీ, మున్సిపాలిటీ గెస్ట్ హౌస్ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పనుల ప్రారంభోత్సవంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, టీజీఐడీసీ చైర్మన్ మువ్వ విజయ్ బాబు, భద్రాద్రి కలెక్టర్ జితేశ్వి పాటిల్, పీవో రాహుల్, ఎస్పీ రోహిత్ రాజ్, డీఎఫ్ వో కృష్ణ, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా, కమిషనర్ శ్రీకాంత్, తహసీల్దార్ కోట రవికుమార్, డీఎస్పీ చంద్రబాను, సీఐ బత్తుల సత్యనారాయణ, కౌన్సిలర్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.