
సూర్యాపేట జిల్లాలో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. నూతనకల్ మండల కేంద్రంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. భూ భారతి చట్టాన్ని అందరి ఆమోదంతోనే అమలు చేశామన్నారు. కొంతమంది వీఆర్వోలు కేసీఆర్ చెప్పిన పనులు చేయలేదని అర్దరాత్రికి రాత్రి వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారన్నారు. త్వరలో రెవిన్యూ వ్యవస్థలో జీపీఏ వ్యవస్థను తీసుకొస్తామన్నారు.
ప్రభుత్వం ఏదైనా కొత్త చట్టం తీసుకొస్తే ప్రజలకు ఉపయోగపడాలి కాని భారంగా మారకూడదన్నారు. దొరగారి గొప్పతనం ... స్వార్థంకోసం.. నలుగురు వ్యక్తులు.. నాలుగు గోడల మధ్య కూర్చొని ధరణి చట్టం తీసుకొచ్చారని.. ధరణి అమలు చేసే సమయంలో వంద రోజులు రిజిష్ట్రేషన్లు జరగలేదన్నారు. గత ప్రభుత్వంలో కబ్జా చేసిన ప్రభుత్వ భూములను.. అక్రమ పట్టాలను రద్దు చేస్తామన్నారు.
భూభారతిపై రైతులు అవగాహన కల్పించేందుకే అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని.. భూభారతి చట్టంలో తహశీల్దార్ నుంచి సీసీఎల్ఏ స్థాయి వరకు సమస్యలు పరిష్కరించేందుకు వెసులుబాటు కల్పిస్తామన్నారు. భూమి రిజిస్ట్రేషన్ కు ముందు తప్పనిసరిగా భూ సర్వే చేసి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుంని.. భూభారతి పోర్టల్ లో అన్ని సమస్యలకు స్వయంగా దరఖాస్తు చేసుకునేలా రూపొందించారు. భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు.
సూర్యాపేట జిల్లా నూతనకల్ లో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటితో పాటు , భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేలు, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పాల్గొన్నారు.
:-