
- భూరికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయట్లేదు
- ఇకపై రైట్ టు ప్రైవసీ ఉండదు.. ప్రతి ఎకరం పోర్టల్‌లో కనిపిస్తది
- వచ్చే నెలలో గ్రామ పాలనాధికారుల నియామకం
- ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అందరి భూములకు భద్రత కల్పించడమే ప్రధాన ధ్యేయంగా భూభారతి చట్టాన్ని, పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రైతుల భూముల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. చెప్పినట్టుగానే ధరణిని బంగాళాఖాతంలో వేసి, భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ చట్టం 2029 అసెంబ్లీ ఎన్నికలకు తమకు రెఫరెండమని పునరుద్ఘాటించారు.
ఆదివారం సెక్రటేరియెట్‌లోని తన చాంబర్‌లో మీడియాతో పొంగులేటి చిట్‌చాట్ చేశారు. గత ప్రభుత్వంలో ఇద్దరు వ్యక్తులు కలిసి రాత్రికి రాత్రే చట్టాన్ని రూపొందిస్తే.. తమ ప్రభుత్వం మాత్రం ప్రజలు, రైతులు, మేధావులు, నిపుణులతో చర్చించి చట్టాన్ని రూపొందించిందని ఆయన తెలిపారు. భూభారతి అమల్లో ఇబ్బందులపై మూడు మండలాల్లో అధ్యయనం చేస్తామని, జూన్ 2కల్లా పూర్తిస్థాయిలో చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ధరణి ముసుగులో జరిగిన భూఅక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని, దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థకు అప్పగించే ఆలోచన ఉన్నట్టు వెల్లడించారు.
డేటా ఉన్నది ఉన్నట్టుగా బదిలీ..
డేటా ధరణి నుంచి భూభారతికి మారేటప్పుడు తమ రికార్డులు మారుతాయోనని, ఎవరైనా తప్పుగా రాస్తారేమోనని రైతుల్లో అనుమానాలు అక్కర్లేదని పొంగులేటి స్పష్టం చేశారు. భూరికార్డుల్లో ఎలాంటి మార్పులుండవని తెలిపారు. ధరణిలోని డేటాను యథాతథంగా భూభారతికి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ధరణి అప్లికేషన్లు కూడా భూభారతికి బదిలీ అవుతాయని, మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు.
స్లాట్‌లు బుక్‌చేసుకుని క్యాన్సిల్చేసుకున్నోళ్ల డబ్బులు తిరిగి ఇచ్చేందుకు ఆర్థిక శాఖతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలిపారు. భూభారతిలో రాష్ట్రంలోని భూముల వివరాలన్నీ ప్రజలకు కనిపిస్తాయని వెల్లడించారు. ‘‘కొందరు సంపన్నులు, వ్యాపారులు, ఉన్నతాధికారులు తమ భూముల వివరాలను గోప్యంగా ఉంచుకునే విధంగా ధరణి పోర్టల్‌లో రైట్ టు ప్రైవసీ అనే విధానం అమలు చేశారు. ఇలా కొన్ని లక్షలాది ఎకరాల భూమి రైట్ టు ప్రైవసీ కింద నమోదైంది. మేం తీసుకొస్తున్న భూభారతి పోర్టల్‌లో రైట్ టు ప్రైవసీని పూర్తిగా ఎత్తివేస్తున్నం. ప్రతి ఎకరం ప్రజలందరికీ కనిపిస్తుంది” అని తెలిపారు.
పోర్టల్‌ను డౌన్ చేయాలని చూస్తే కఠిన చర్యలు..
రాష్ట్రవ్యాప్తంగా 10,956 గ్రామాలు ఉన్నాయని, మే నాటికి గ్రామ పాలనాధికారుల సేవలను అందుబాటులోకి తెస్తామని పొంగులేటి తెలిపారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో 480 మంది సర్వేయర్లు ఉన్నారని, వాళ్ల సంఖ్యను వెయ్యికి పెంచుతామని చెప్పారు. అలాగే 6 వేల మంది ప్రైవేట్ సర్వేయర్లకు లైసెన్స్‌లు ఇచ్చి శిక్షణ ఇస్తామని వెల్లడించారు. భూభారతి చట్టం, పోర్టల్ అమల్లో ఎదురయ్యే ఇబ్బందులపై అధ్యయనం చేసేందుకు ఎంపిక చేసిన గ్రామాల్లో తాను స్వయంగా పర్యటిస్తానని పేర్కొన్నారు. కాగా, రైతులు తమ భూముల వివరాలు తెలుసుకునేందుకు అందరూ ఒకేసారి పోర్టల్‌ను ఓపెన్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.