- ఇన్నేండ్లలో ఒక్క గ్రామసభ కూడా పెట్టలే
- ఇప్పుడు అవాకులు, చెవాకులు పేలుతున్నారు
- ఖమ్మం జిల్లా పర్యటనలో బీఆర్ఎస్పై మంత్రి పొంగులేటి ఫైర్
కూసుమంచి, వెలుగు : రాష్ట్రంలో పదేండ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు గడ్డి పీకారా? అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో రూ.1.70 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదేండ్లలో రేషన్ కార్డులు, ఇండ్లు ఇస్తే ఇప్పుడీ గొడవంతా ఎందుకు ఉంటదని ప్రశ్నించారు. ఇన్నేండ్లలో ఒక్క గ్రామసభ కూడా పెట్టలేదని, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పాలనపై అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు.
అరాచక శక్తులు, వీధి గూండాల్లా రెచ్చిపోతే ప్రభుత్వం ఉపేక్షించబోదని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతల ప్రవర్తన ఇలాగే కొనసాగితే స్థానిక సంస్దల ఎన్నికల్లో గల్లంతై పోతారన్నారు. పేదవాడికి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని మీకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు. అర్హులైన నిరుపేదలు ఎవరైనా చిన్న కాగితం ముక్క మీద వివరాలు రాసిచ్చినా అదే అప్లికేషన్ గా భావించి వారికి పథకాలు అమలు చేసే బాధ్యత తమ ఇందిరమ్మ ప్రభుత్వానిదన్నారు.
వచ్చే వర్షాకాలం నాటికి పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో సీసీ రోడ్లు, లింక్ రోడ్డు, వరదలో పాడైన రోడ్ల రిపేర్లు పూర్తి చేస్తానని తెలిపారు. విద్యుత్ వైర్ల సమస్య పరిష్కారం కోసం రూ.9 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎం.విజయ బాబు, నియోజకవర్గ ప్రత్యే1కాధికారి రమేశ్ పాల్గొన్నారు.