భూ భారతి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి

భూ భారతి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి

హైదరాబాద్: ధరణి స్థానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా 2024, డిసెంబర్ 18వ తేదీన ఈ బిల్లును మంత్రి సభ ముందుకు తీసుకొచ్చారు. అనంతరం భా భారతి బిల్లుపై మంత్రి పొంగులేటి చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‎తో  మూడేళ్లలో లక్షలు సమస్యలు వచ్చాయని.. సమస్యలు తీర్చాలని తెచ్చిన ధరణితోనే మరిన్ని కొత్త సమస్యలు వచ్చాయన్నారు.

ఎవరి అభ్యంతరాలు తీసుకోకుండా తీసుకోకుండా నాలుగు గోడల మధ్య కూర్చొని ధరణి తెచ్చారని.. యాజమానికి తెలియకుండానే భూమి పోయే పరిస్థితి తీసుకొచ్చారని బీఆర్ఎస్‎పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ధరణి పోర్టల్‎ను బంగాళాఖాతంలో పడేశామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలస్యమైనా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని పేర్కొన్నారు. 

Also Read:-హరీష్ రావుకు దబాయించడమే వచ్చు.. పని చేయడం రాదు..

భూ భారతి చట్టం ద్వారా భూములను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. ఇవాళ (డిసెంబర్ 18) భూ భారతి బిల్లు అసెంబ్లీ ముందుకు తీసుకురావడం అద్భుతమైన ప్రగతికి బాట వేసే రోజని అన్నారు. ఆర్వోఆర్ యాక్ట్ 2020ని ప్రక్షాళణ చేసి భూ భారతిని తెచ్చామని స్పష్టం చేశారు. 33 జిల్లాల నుంచి ప్రజలు, మేధావుల అభిప్రాయాలు తీసుకుని బిల్లు రూపొందించామని తెలిపారు.