- ఇండ్ల ఎంపికలో సమస్యలు ఉంటే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు
- ఆ వెంటనే ఫిర్యాదుదారుడి ఫోన్‌కు మేసెజ్ ద్వారా ఆన్సర్
- వెబ్‌సైట్ ప్రారంభించిన హౌసింగ్ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పారదర్శకమైన సేవలను అందించాలనే లక్ష్యంతో గ్రీవెన్స్ మాడ్యూల్‌ను తీసుకువస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇండ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఉంటే లబ్ధిదారులు ఈ గ్రీవెన్స్ మాడ్యూల్‌లో ఫిర్యాదు చేయొచ్చని వెల్లడించారు. గురువారం సెక్రటేరియెట్‌లో వెబ్‌సైట్‌ను, గ్రీవెన్స్ మ్యాడ్యూల్‌ను హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ద ప్రకాశ్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్, కార్పొరేషన్ టెక్నికల్ మేనేజర్ వెంకట్రామ్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..
ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే www.indirammaindlu.telangana.gov.inకు ఫిర్యాదు చేయొచ్చని, దీనిపై ఎప్పటికప్పుడు తీసుకున్న చర్యలు వివరాలను ఫిర్యాదుదారుని మొబైల్‌కు మెసేజ్ ద్వారా తెలుపుతామని చెప్పారు. గ్రామాల్లో ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదు వెళ్తుందని వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఎలాంటి మధ్యవర్తులకు తావులేకుండా అర్హులైన వారికే ఇండ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వీలైనంత త్వరితగతిన ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.
95 శాతం ఇండ్ల అప్లికేషన్ల సర్వే పూర్తి..
బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల అప్లికేషన్ల సర్వే 95 శాతం పూర్తయిందని, జీహెచ్‌ఎంసీలో 38 శాతం పూర్తయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో 98 శాతం, ములుగు, కరీంనగర్, సంగారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో 97 శాతం, మహబూబూబాద్, జగిత్యాల, సిద్దిపేట,ఆసిఫాబాద్, జనగామ, రంగారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి, పెద్దపల్లి పది జిల్లాల్లో- 96 శాతం పరిశీలన పూర్తయిందని మంత్రి వెల్లడించారు.
త్వరలో లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి ఇండ్ల నిర్మాణానికి చేపట్టాల్సిన కార్యాచరణపై దృష్టి సారించాలని, అలాగే అర్హులైన లద్ధిదారులకు ఇండ్లు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. మొదటి విడతలో సొంత జాగా ఉన్న వారికి ఇళ్లు ఇస్తామని, రెండవ దశలో ప్రభుత్వమే నివాస స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తుందని గుర్తుచేశారు. మొదటి విడతలో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అనాధలు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లు, సఫాయి కర్మచారులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశామని మంత్రి గుర్తుచేశారు.
గత ప్రభుత్వంలో ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి లబ్ధిదారులే ఇండ్లు నిర్మించుకునేలా అవకాశం కల్పించామన్నారు. లబ్ధిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా ఇండ్లు నిర్మించుకోవచ్చని వెల్లడించారు. చివరి లబ్ధిదారుని వరకు ఇండ్లు మంజూరు చేసి, నిర్మించే బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని మంత్రి స్పష్టం చేశారు.