
- ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం
- న్యాయం ఉంటే ఏ పార్టీ అని చూడం
- యజమానులందరికీ భూహక్కు పత్రాలిస్తామని వెల్లడి
- ఆదిలాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో భూభారతి అవగాహన సదస్సులు
- మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి ప్రారంభించిన మంత్రి
ఆదిలాబాద్/జయశంకర్ భూపాలపల్లి,వెంకటాపూర్ (రామప్ప), వెలుగు:అర్హులైన ప్రతి రైతుకూ భూమి హక్కు పత్రాలు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పెదల ప్రభుత్వమని, న్యాయం ఉంటే ఏ పార్టీ అని చూడమని, అసలు యజమానులందరికీ భూహక్కు పత్రాలిస్తామని తెలిపారు. పైసా తీసుకోకుండా రైతులకు పట్టా పాస్ బుక్కులిచ్చే బాధ్యత ప్రజా ప్రభుత్వానిదని పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం పూసాయి గ్రామంలో, ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూభారతి అవగాహన సదస్సులను ప్రారంభించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. 2020లో బీఆర్ఎస్సర్కారు తీసుకొచ్చిన ధరణి చట్టం వల్ల లక్షలాది మంది పేద రైతులకు అన్యాయం జరిగిందన్నారు. సొంత భూముల కోసం రైతులు చెప్పులు అరిగేదాక ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరిగారని, భార్య మెడలో ఉన్న పుస్తెలతాడు తాకట్టు పెట్టినా.. ధరణిలో సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి చట్టం చేసిన తర్వాత గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెట్టలేదని.. ఆనాడు సదస్సులు పెడితే ధరణి భాదితులు వాళ్ల వీపులు పగలకొట్టేవారని పేర్కొన్నారు.
ఒక్కో అప్లికేషన్‌కు రూ.వెయ్యి చొప్పున వసూలు చేసిన ఆనాటి కేసీఆర్ సర్కారు.. రైతులను ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్నదే తప్ప సమస్యలను పరిష్కరించలేదన్నారు. పార్ట్ బీ కింద 18 లక్షల ఎకరాల భూములను పెడితే అందులో 6.5 లక్షల ఎకరాలు పేద రైతులకు చెందినవేనని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో వేస్తామని ముందుగానే చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రజల మద్దతుతో దానిని రద్దు చేసి.. పేద రైతుల సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ మంత్రులంతా కలిసి ప్రజలందరికి తెలియచేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు.
భూ భారతి చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించి.. స్పీకర్‌పై, తనపై కాగితాలు చింపి పడేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 9.24 లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని.. వాటన్నింటిని భూభారతి ద్వారా పరిష్కరించి పైసా ఖర్చు లేకుండా రైతులకు పట్టాదారు పాస్ బుక్కులిస్తామని మంత్రి తెలిపారు.
స్పాట్‌లోనే ముగ్గురు రైతుల సమస్యకు పరిష్కారం
ములుగు జిల్లా వెంకటాపూర్‌లో శుక్రవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు హాజరై తమ సమస్యలు చెప్పుకున్న ముగ్గురు రైతులకు రెవెన్యూ ఆఫీసర్లు అక్కడికక్కడే పరిష్కారం చూపించి కొత్త పట్టాదారు పాస్ బుక్కులకు సిఫారసు చేశారు. ధరణి వల్ల ఏండ్ల తరబడి తిరిగినా పరిష్కారం కానీ తమ భూ సమస్య.. భూ భారతి చట్టం వల్ల అయిందని రైతులు అన్నారు.
కాగా, పూసాయి లో ఏర్పాటు చేసిన సదస్సు స్టేజీపైన కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి కూర్చోవడం పట్ల బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు వారితో వాగ్వావాదానికి దిగడంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలను పక్కకు తీసుకెళ్లారు. శ్రీనివాస్‌రెడ్డి స్టేజీపై నుంచి దిగిపోవడంతో వివాదం ముగిసింది.
భూమి, రైతులది తల్లీబిడ్డల బంధం: మంత్రి సీతక్క
భూమితో రైతులకు మధ్య ఉన్న సంబంధం తల్లి బిడ్డల మధ్య ఉండే బంధం వంటిదని మంత్రి సీతక్క అన్నారు. అలాంటి బంధాన్ని విడదీసి ధరణి పేరుతో గత పాలకులు దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. అసలైన రైతుకే భూయాజమాన్య హక్కులు రావాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని.. అందుకే భూ భారతి చట్టం తీసుకొచ్చామని పేర్కొన్నారు. ధరణితో రైతులకు మొఖాపై ఉన్నప్పటికీ పట్టా బుక్కులు వేరొకరి పేరు మీద ఇచ్చారని.. దీనివల్ల అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.
భూ భారతి చట్టంతో గ్రామాల్లో అక్రమంగా పట్టాలు పొందిన అందరి రికార్డులు బయటపెడతామని మంత్రి సీతక్క వివరించారు. రెవెన్యూ ఆఫీసర్లు న్యాయంగా పనిచేసి అర్హులైన రైతులకు పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని ఆదేశించారు. పేదల కోసం ఉపయోగపడే పథకాలు మాత్రమే మా ప్రభుత్వం తెస్తుందని.. వీటిని చూసి ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు చేస్తున్నాయని అన్నారు.
తప్పు ఉంటే నా పని కూడా చేయొద్దు..
భూభారతిలో చిన్న తప్పుకూడా జరగొద్దని అధికారులను మంత్రి పొంగులేటి హెచ్చరించారు. ‘‘ఆఫీసర్లకు ఒకటే చెప్తున్నా. ఎక్కడా చిన్న తప్పు జరగొద్దు. అందరం రైతు కుటుంబం నుంచి వచ్చినోళ్లమే. రైతు తిండి పెడితేనే బతుకుతున్నాం. న్యాయం ఉంటే ఏ పార్టీ అని చూడకండి. తప్పు ఉంటే నా పని కూడా చేయొద్దు. రైతులను ఎక్కడా ఇబ్బంది పెట్టకండి. అర్హులైన ప్రతీ రైతుకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాల్సిందే. మొక్కుబడిగా రెవెన్యూ సదస్సులు జరపకండి.
జిల్లా కలెక్టర్లు స్వయంగా రెవెన్యూ సదస్సులకు వెళ్లి భూభారతి గురించి అవగాహన కల్పించాలి. పైసా తీసుకోకుండా రైతులకు పట్టా పాస్ బుక్కులు ఇవ్వాలి’’ అని మంత్రి ఆదేశించారు. కేసీఆర్ తెచ్చిన ధరణి చట్టం మూడేండ్లకే మూలకు పడిందని.. అందుకే తాము ప్రజల మధ్యకు వచ్చి భూభారతి చట్టం గురించి వివరిస్తున్నామని ఆయన తెలిపారు.
దేశానికి వెన్నెముక రైతన్న: మంత్రి కొండా సురేఖ
దేశానికి రైతన్న వెన్నెముక లాంటి వాడని మంత్రి కొండా సురేఖ అన్నారు. అలాంటి అన్నం పెట్టే రైతు నోట్లో గత ప్రభుత్వం మట్టి కొట్టిందని మండిపడ్డారు. అసలు రైతులను మోసం చేసి, ఇతరులకు పట్టాలు చేశారని పేర్కొన్నారు. రైతులను మోసం చేయడానికే కేసీఆర్ ధరణి తెచ్చారని.. ఇందిరమ్మ హయాంలో పేదలకు పంచిన అసైన్డ్ భూములను కూడా లాక్కుని అనర్హులు పట్టాలు పొందారని తెలిపారు. భూమి హక్కు పత్రాల కోసం రైతులు కాళ్లరిగేలా ఆఫీసర్ల చుట్టూ తిరిగిన పనికాలేదని.. ఇక రైతులకు అలాంటి కష్టాలు ఉండవని.. ఆఫీసర్లే ఇంటివద్దకు వచ్చి సమస్యను పరిష్కరిస్తారని మంత్రి పేర్కొన్నారు.