నేలకొండపల్లిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

  •  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

 నేలకొండపల్లి, వెలుగు :  నేలకొండపల్లిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరంలో రూ.3కోట్లతో నిర్మించిన రామదాసు ఆడిటోరియాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తరామదాసు నడయాడిన స్థలాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తామన్నారు.

  ప్రపంచంలో ఉన్న నాలుగైదు బౌద్ధ స్థూపాల్లో ఒకటి ఇక్కడ ఉండడం గర్వకారణమన్నారు.  రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు. భక్త రామదాసు తెలంగాణ ప్రభుత్వానికి ఆదర్శం అని, అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లు అన్నారు. అనంతరం మండలంలోని రాయిగూడెం  గ్రామంలో  చెరువు మాదారం ఎత్తిపోతల పైపులను ఆన్ చేసి సాగుకు నీటిని విడుదల చేశారు. 

ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నేలకొండపల్లి మండలంలోని ఆరు గ్రామాలో 4 వేల ఎకరాలు ఆంధ్రాలోని జగ్గయ్యపేట మండలంలోని 8వందల ఎకరాలు సాగు అవుతుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో  రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఇరిగేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, నాయకులు నెల్లూరి  భద్రయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శాఖమూరి రమేశ్, మాజీ సర్పంచులు రాయపూడి నవీన్ కుమార్, వంగవీటి నాగేశ్వరరావు, మామిడి వెంకన్న, మైసా శంకర్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షేక్ ఖాజామియా తదితరులు పాల్గొన్నారు.