విద్యాభివృద్ధికి రెడ్డి జన సంఘం సేవలు అభినందనీయం... మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

బషీర్ బాగ్, వెలుగు : విద్యాభివృద్ధికి రెడ్డి జన సంఘం సేవలు అభినందనీయమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశంసించారు.  అబిడ్స్ లోని రెడ్డి బాయ్స్ హాస్టల్ ఆడిటోరియంలో రెడ్డి జన సంఘం ఆధ్వర్యంలో 2023- –24లో ఇంజనీరింగ్, మెడికల్, గ్రాడ్యుయేషన్ లో మెరిట్ సాధించిన 353 మంది విద్యార్థులకు రూ. 30 లక్షల చెక్కులను మంత్రి అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి  ముందుగా రెడ్డి హాస్టల్ ఆవరణలోని రాజా బహదూర్ వెంకటరామ్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. 105 ఏండ్ల కిందట బాలికల విద్య కోసం కులమతాలకు అతీతంగా ఉచిత విద్యతో పాటు ఉచిత వసతికి రెడ్డి హాస్టల్ ను ప్రారంభించారని గుర్తుచేశారు. ఉపకార వేతనాల లబ్ధి పొందిన విద్యార్థులు మరిచిపోకుండా ఉన్నతంగా ఎదిగిన అనంతరం తమవంతు సాయం అందించాలని కోరారు. రెడ్డి జన సంఘం కోరిక మేరకు 2  ఎకరాల స్థలం కేటాయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మంత్రి పొంగులేటిని, నల్గొండ ఎంపీ  కందూరి రఘువీర్ రెడ్డిని జన సంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి నర్సింహారెడ్డి, సలహాదారులు ప్రొఫెసర్ కంచర్ల దశరథ్ రెడ్డి, కోశాధికారి కాశీరెడ్డి పాండురంగారెడ్డితో దాతలు డాక్టర్ మహిపాల్ రెడ్డి, ఆర్జేఎస్ సుకన్యారెడ్డి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బాలకృష్ణారెడ్డిలను ఘనంగా సన్మానించారు.