ప్రక‌టన‌ల పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ : పొంగులేటి శ్రీ‌నివాస్​రెడ్డి

ప్రక‌టన‌ల పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ : పొంగులేటి శ్రీ‌నివాస్​రెడ్డి
  • ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికే రూ.564 కోట్లు ఖర్చు: మంత్రి పొంగులేటి
  • సొంత పత్రికలు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు టారిఫ్​ల ద్వారా దోచిపెట్టిన్రు
  • ఏప్రిల్ నుంచి భూ భారతి అమల్లోకి తెస్తామని వెల్లడి

హైద‌రాబాద్: గ‌త బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ప్రకటన‌ల పేరిట కొల్లగొట్టింద‌ని, సొంత ప‌త్రిక‌లు, మీడియాకు ధారాద‌త్తం చేసింద‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్​రెడ్డి ఆరోపించారు. గడిచిన పదేండ్లలో ప్రకటనల కోసం బీఆర్ఎస్ సొంత మీడియా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, ‘టీ న్యూస్’కు ఎంత దోచిపెట్టారన్న దానిపై సమాచార శాఖ మంత్రిగా బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్​ చేశారు. బుధ‌వారం శాస‌న‌స‌భ‌లో స‌మాచార పౌర‌సంబంధాల శాఖ ప‌ద్దుల‌పై పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి  మాట్లాడారు.  గ‌త బీఆర్ఎస్​ ప్రభుత్వం ప‌దేండ్లలో రూ.564.40 కోట్లను ఇతర రాష్ట్రాల్లో సొంత‌ ప్రచారానికి వాడుకున్నదని తెలిపారు. తమ ప్రభుత్వం 16 నెలల కాలంలో రాష్ట్రంలో మాత్రమే ప్రకటనలకు దాదాపు రూ.200 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. 

భారీగా ప్రజాధనం దుర్వినియోగం 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రక‌ట‌న‌ల పేరిట చేసిన ప్రజాధ‌నం దుర్వినియోగాన్ని మంత్రి పొంగులేటి వివ‌రించారు. 2014లో  ‘న‌మ‌స్తే తెలంగాణ’ ప‌త్రిక‌కు కాలమ్​ సెంటీమీట‌ర్‌కు రూ.875 గా ఉండేద‌ని, త‌ర్వాత 2016లో అది రూ. 1150కు చేరింద‌ని, 2019లో రూ.1500కు పెంచేశార‌ని తెలిపారు. ఇదే స‌మ‌యంలో అత్యధిక స‌ర్క్యులేష‌న్ క‌లిగిన ఈనాడు ప‌త్రిక టారిఫ్ రూ. 1500 గా ఉంద‌న్నారు. దీనిని బ‌ట్టి  గ‌త ప్రభుత్వం సొంత‌ ప‌త్రిక‌కు ఏవిధంగా దోచిపెట్టిందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.  ఈనాడుకు, న‌మ‌స్తే తెలంగాణ‌కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు.

 ఇక ‘తెలంగాణ టుడే’ అనే వారి సొంత ఆంగ్ల పత్రిక‌కు 2017లో కాలమ్​ సెంటీ మీట‌ర్ రూ.వెయ్యి ఉండ‌గా, కేవ‌లం రెండేండ్ల వ్యవ‌ధిలో 2019లో ఈ రేటును రూ.2 వేలకు పెంచార‌ని తెలిపారు. ఇదే స‌మ‌యంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ప‌త్రిక టారిఫ్ రూ.వెయ్యి మాత్రమేన‌ని మంత్రి వివ‌రించారు. ఇక్కడ కూడా ఎంత దోపిడీ జ‌రిగిందో గ‌మ‌నించాల‌ని అన్నారు. ఇక టీవీ ప్రక‌టన‌ల విష‌యానికి వ‌స్తే ‘టీ న్యూస్’​చాన‌ల్ కు సెక‌న్​కు రూ.3 వేల రేటు నిర్ణయించారని, అదే ఈటీవీకి రూ.2,500, ఎన్టీవీకి రూ.3 వేలుగా ఉందన్నారు.  ఈ రేట్లను గమనిస్తే ప్రజల సొమ్మును బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేసిందో అర్థమవుతుందని చెప్పారు.

ఏప్రిల్​లో భూ భారతి..

రాష్ట్రంలో గ‌త ప‌దేండ్లలో ధ‌ర‌ణి పోర్టల్ తో ప్రజ‌లు ప‌డుతున్న క‌ష్టాలకు శాశ్వత విముక్తి క‌ల్పించేలా  భూ భార‌తి చ‌ట్టాన్ని త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువ‌స్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి చెప్పారు. 

నాలుగు గోడల మధ్య నలుగురు 

తీసుకున్న చట్టం ఫలితంగా అనేక మంది ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అధికారంలోకి వ‌స్తే ధరణిని బంగాళాఖాతంలో క‌లుపుతామ‌ని హామీ ఇచ్చామని, ఈ మేరకు  భూభార‌తి చ‌ట్టాన్ని ఏప్రిల్  నుంచి అమ‌ల్లోకి తీసుకురాబోతున్నామని తెలిపారు.  

గ్రామాల్లో రెవెన్యూ సేవ‌లు

ధరణి సమస్యలను పరిష్కరించేందుకు మండల స్థాయిలో తహసీల్దార్‌కు, డివిజన్‌ స్థాయిలో ఆర్డీవోలకు, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లకు సమస్యలను పరిష్కరించే అధికారాన్ని అప్పగించామని మంత్రి పొంగులేటి తెలిపారు. 2023 డిసెంబర్​ 7 నుంచి ఇప్పటివరకు 6 లక్షల అప్లికేషన్లు రాగా.. 5 లక్షల కు పైగా  పరిష్కరించినట్లు చెప్పారు.  భూభారతిచట్టం ద్వారా  రిజిస్ట్రేషన్​ టైంలోనే  సర్వే​ మ్యాప్​ డ్యాక్యుమెంట్​లో పెట్టాలని నిర్ణయించామన్నారు.