- సొంత ఆలోచనలు మాని ప్రభుత్వ స్కీమ్‌లను అమలు చేయండి
భద్రాద్రికొత్తగూడెం/ఇల్లెందు, వెలుగు : ‘కొందరు ఆఫీసర్లు డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా.. ఇంకా పాత పోకడల్లోనే ఉన్నారు.. ఇప్పడికైనా పద్ధతి మార్చుకోండి.. సొంత ఆలోచనలు మాని ప్రభుత్వ ఆలోచనలను అమలు చేయండి.. లేకపోతే ఇబ్బందులు తప్పవు’ అంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. ఇల్లందులో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం నియోజకవర్గంలో చేపట్టిన వివిధ పనులపై బొజ్జాయిగూడెంలో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆఫీసర్ల సొంత నిర్ణయాలను ప్రజలపై రుద్దొద్దని సూచించారు. భూముల విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్నారు. ప్రభుత్వ భూముల కబ్జాల్లో ఎంతటి వారున్నా, చివరకు ఎమ్మెల్యే అయినా సరే వదిలి పెట్టొద్దని ఆఫీసర్లకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వచ్చే నెలలో స్మార్ట్ రేషన్, హెల్త్ కార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక వచ్చే నెలలో మొదలు అవుతుందన్నారు. ఉపాధిహామీ, ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించిన ఆఫీసర్ల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం మున్సిపాలిటీల్లో ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ఏర్పాటు చేయాలని, దీనిని కలెక్టరేట్‌కు అనుసంధానం చేసుకోవాలని చెప్పారు. విద్య, వైద్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు
మారుమూల గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్ల సరఫరాపై ఎమ్మెల్యే చెప్పినానిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆకస్మిక తనిఖీలు చేసిన టైంలో తాగునీరు పరిశుభ్రంగా లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, ఎస్పీ బి.రోహిత్‌రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.