మహబూబాబాద్: ‘‘గుమ్మడి కాయల దొంగ అంటే.. భుజాలు ఎందుకు తడుముకుంటున్నవ్ కేటీఆర్..?’’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఇవాళ తొర్రూర్ వ్యవసాయ నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్.. నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలుసు.. పడబోయే శిక్ష ఏంటో నీకు తెలుసు’’ అని అన్నారు. 11 నెలలుగా బీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు.
తల తాకట్టు పెట్టయిన డిసెంబర్ లోపు 13 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని అన్నారు. ‘‘రుణమాఫీ అయ్యాక నీ తల ఏ టైర్ కింద పెడతావో ఆలోచించుకో’’ అని అన్నారు. తాను బీఆర్ఎస్లో చేరే సమయంలో కేసీఆర్ను తండ్రిలా భావించి కాళ్లు మొక్కానని అన్నారు. కానీ తడిగుడ్డతో గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నాలుగు గోడల మధ్య కాళ్లు పట్టుకొనే అవసరం లేదని అన్నారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు ‘‘పొంగులేటి హోం మంత్రా..? అలా ఎందుకు మాట్లాడుతున్నారు’’ అని అంటున్నారని, తాను క్యాబినెట్ మంత్రినని, అన్ని విషయాలూ మాట్లాడుతానని అన్నారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తానని అంటున్నారని, పాదయాత్ర చేస్తారో.. మోకాళ్ల యాత్ర చేస్తాడో నిర్ణయం ఆయనే తీసుకోవాలని పొంగులేటి ఎద్దేవా చేశారు.
తాను ఆ పార్టీ, ఈ పార్టీ నేతలను అరెస్టు చేస్తారని ఎక్కడా చెప్పలేదని తెలిపారు. దానికి శ్రీనివాస్ రెడ్డి అదాని కాళ్లు మొక్కాడని ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తనకు చట్టం తెలుసునని, ఎప్పుడు, ఎక్కడ ఏం జరగాలో అది జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి అనుమాండ్ల ఝాన్సీరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.