కేసీఆర్ జీవితమంతా ఫామ్ హౌసే: మంత్రి పొంగులేటి కౌంటర్

కేసీఆర్ జీవితమంతా ఫామ్ హౌసే: మంత్రి పొంగులేటి కౌంటర్

హైదరాబాద్:  ప్రజ‌లు అత్యాశ‌కు పోయి కాంగ్రెస్‎కు ఓటేశారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజ‌ల‌ను అవ‌మానించేలా ఉన్నాయని.. ప్రజా తీర్పును ఆయన అగౌరవ పరుస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. ప్రజ‌ల‌న్నా.. ప్రజాతీర్పు అన్నా కేసీఆర్‎కు ఏనాడూ గౌర‌వం లేదన్నారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు అన్ని మేం కూడా గమనిస్తున్నాం. ఇక నుంచైనా ఫామ్ హౌస్‎లోనే ఉండి మాట్లాడతారా.. లేదా అసెంబ్లీకి వస్తారా..? అని ప్రశ్నించారు. 

13 నెలల పాటు ఫామ్ హౌజ్‎కే పరిమితమై ఇంతకాలం మౌనంగా ఉన్నానని ఇప్పుడేదో అంటే సరిపోదుని.. ప్రతిపక్ష నాయకుడంటే ప్రజల్లో తిరగాలి. ప్రజా సమస్యలు ప్రస్తావించాలి. కానీ వ‌ర్షాలు వ‌చ్చినా.. వ‌ర‌ద‌లు వ‌చ్చినా కేసీఆర్ క‌నీసం ప్రజ‌ల‌ను ప‌రామ‌ర్శించ‌లేదు. ఫామ్ హౌస్ దాట‌లేదని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు  స‌చివాల‌యానికి రాలేదు. ప్రతిప‌క్ష నేత‌గా ఏడాది నుంచి అసెంబ్లీకి రాలేదు. ప్రజ‌ల్లోకి రాలేదు.. కేసీఆర్ జీవితమంతా ఫామ్ హౌసేనేనని ఎద్దేవా చేశారు. 

ప‌దేండ్లు అధికారం ఇచ్చిన ప్రజ‌ల‌కు ఓడిపోయిన త‌ర్వాత ఈ రోజు వ‌ర‌కు కూడా కనీసం కృత‌జ్ఞత తెల‌ప‌లేదని.. ప్రజాతీర్పును శిర‌సావ‌హిస్తున్నామ‌ని కూడా ప్రక‌టించ‌లేదని మండిపడ్డారు. ఈ ఏడాది కాలంలో న‌ల్గొండ, క‌రీంన‌గ‌ర్ బీఆర్ఎస్ స‌భ‌ల్లో కూడా.. ఈరోజు మాదిరిగానే గంభీర ప్రక‌ట‌న‌లే చేశారు. ఆ త‌ర్వాత ఏమ‌య్యారో అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. 

Also Read :- ఒంట్లో బుల్లెట్ ఉన్న పోరాటం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్

ప్రతిప‌క్ష నేత‌గా అసెంబ్లీ ముఖం చూడ‌ని వ్యక్తి.. త‌న ఉనికిని చాటుకోవ‌డానికి, నేనున్నాన‌ని చెప్పుకోవ‌డానికి తుపాకీ రాముడిలా, పిట్టల దొర మాదిరి మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజలు ఏదో నమ్మి ఓటేశారని అంటున్నావు. వాస్తవాలు గ్రహించి నీ గడీల పాలన వద్దనుకుని ప్రజలు నిన్ను నీ కుటుంబాన్ని ఛీత్కరించారని కౌంటర్ ఇచ్చారు.

పథకాలు అమలు కాలేదని ఫామ్ హౌజ్‎లో కూర్చొని మాట్లాడటం కాదు. ఇప్పటికైనా ప్రజల్లోకి రావాలనే మేమంటున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాలకు రావాలని సీఎం రేవంత్ పదే పదే ఆహ్వానించారు. 80 వేల పుస్తకాలు చదివినారన్నారు. మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు రాలేదని నిలదీశారు.