మున్నేరు రిటైనింగ్ వాల్ భూసేకరణ పూర్తి చేయాలి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం టౌన్, వెలుగు : మున్నేరు నదికిరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు అవసరమైన భూమిని త్వరగా సేకరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ లోని తన నివాసంలో  కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అడిషనల్​ కలెక్టర్ పి.శ్రీజ, సంబంధిత అధికారులతో వాల్ నిర్మాణ, భూసేకరణ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. మున్నేరు నది తీరం వెంబడి రూ. 690 కోట్లతో 17 కిలోమీటర్ల ఆర్‌సీసీ రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 

రెండు వైపులా గోడ నిర్మాణానికి ప్రస్తుత అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో 5.1 కిలో మీటర్లు రూరల్ మండలం వైపు, 1.7 కిలో మీటర్ల ఖమ్మం అర్బన్ వైపు నిర్మించవచ్చని చెప్పారు. నది వద్ద క్లియర్ గా ఉన్న 8 కిలో మీటర్ల మేర ట్యాగింగ్ చేయాలన్నారు. జూలై 15 నాటికి రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు రోజువారి పనుల పురోగతితో షెడ్యూల్ రూపొందించి ఈనెల16 నాటికి సమర్పించాలన్నారు. ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర రావు, ఈఈ అనన్య, ఆర్డీవో నరసింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేశ్, ఖమ్మం అర్బన్, రూరల్ తహసీల్దార్లు రవికుమార్, రాంప్రసాద్, తదితరులు 
పాల్గొన్నారు.

భూ వివాదాల పరిష్కారానికి కృషి

అనంతరం ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి, కలెక్టర్, అడిషనల్​ కలెక్టర్, సంబంధిత అధికారులతో రెవెన్యూ , అటవీభూముల సమస్యల పరిష్కారం, భూ వివాదాలపై మంత్రి సమీక్షించారు.  అసైన్మెంట్ పట్టాలలో గత 40 సంవత్సరాలుగా క్షేత్ర స్థాయిలో రైతులు సాగు చేస్తున్నారని, రైతులకు ఉన్న భూ సమస్యలు రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పని చేసి పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో 15 సర్వే నెంబర్ లలో 1,500 ఎకరాలు రెవెన్యూ, అటవీ భూముల బౌండరీ సమస్య ఉందని, దీనిని సర్వే ద్వారా పరిషష్కరించాలన్నారు. 

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై నివేదిక అందించాలని సూచించారు. మైనింగ్ క్వారీ కోసం రెవెన్యూ భూములు ఎక్కడ కేటాయించారు, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం లాంటి అంశాలపై పరిశీలించాలని ఆదేశించారు. 

ఖమ్మం రూరల్ మండలంలో లీజు సమయం ముగిసిన ప్రభుత్వ భూములలో మైనింగ్ క్వారీలు మూసివేసి పనికి వచ్చే భూముల వివరాలతో కలెక్టర్ కు నివేదిక అందించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు లక్షన్నర ఎకరాల అటవీ భూమి ఉందని, వీటిలో కొన్ని సర్వే నెంబర్లలో సమస్యలు ఉన్నాయని తెలుపుతూ ప్రాంతాలవారీగా, సర్వే వారీగా ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి 
తీసుకొచ్చారు.