100 యూట్యూబ్ ఛానెళ్లతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం: మంత్రి పొంగులేటి

100 యూట్యూబ్ ఛానెళ్లతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం: మంత్రి పొంగులేటి

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నాకు ఎంత ద్రోహం చేశారో అందరికీ తెలుసని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు  చేశారు. శనివారం (అక్టోబర్ 26)  ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మూసీ పునర్జీవనం చేయడం కోసం ఇటీవల చేసిన దక్షిణ కొరియోలోని సియోల్ పర్యటన విజయవంతంగా ముగిసిందని.. ఈ టూర్‎లో  సియోల్‎తో పాటు మరికొన్ని నగరాల్లో పర్యటించామని తెలిపారు. మూసీలాగే గతంలో సియోల్ నది కూడా మురికి కూపంగా ఉండేదని.. కానీ అక్కడి అధికారులు ప్రణాళికబద్ధంగా సియోల్‎ను అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. 

త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సియోల్ పర్యటన వివరాలు ఆయనకు అందజేస్తామని చెప్పారు. సియోల్ పర్యటనపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రాజెక్టుపై సలహాలు ఇవ్వమంటే ప్రతిపక్షాలు ఇవ్వడం లేదు.. రాజకీయ లబ్ధి కోసమే మూసీపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎవరు అడ్డుపడ్డ మూసీని పునర్జీవనం చేస్తామని.. మూసీ అభివృద్ధి ఖచ్చితంగా సాధ్యమేనని నొక్కి చెప్పారు. మూసీ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసిందని గుర్తు చేసిన పొంగులేటి.. ఇప్పుడు రైతులపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. 

రైతులపై బీఆర్ఎస్ నేతలకు ఎంత ప్రేమ ఉందో ప్రజలు తెలుసని ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుండు సున్నా ఇచ్చారని అన్నారు. ప్రభుత్వానికి ఏ ఒక్కరి మీద కోపం లేదని.. కేవలం తప్పు చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. రాజకీయ విమర్శలు చేసే ముందు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. 100 యూట్యూబ్ ఛానెళ్లతో ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.