- గత ప్రభుత్వంలో కీలక నేతలపై ఫైల్స్రెడీ
- పక్కా ఆధారాలున్నయ్.. ఎవరినీ వదిలిపెట్టం
- వచ్చేనెల 1 నుంచి 8 వరకు అందరూ లోపలికెళ్తరు
- మూసీ వెంట గత ప్రభుత్వంలో మంత్రులు, వారి తొత్తుల కబ్జాలు
- పబ్బం గడుపుకునేందుకే బావా, బామ్మర్దుల మూసీ రాజకీయాలని ఫైర్
సియోల్ నుంచి వెలుగు ప్రతినిధి: గత సర్కారు చేసిన కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళి లోపే బాంబులా పేలుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యుల అక్రమాలపై అన్ని రకాల ఫైల్స్ రెడీ అయ్యాయని, నవంబర్ 1 నుంచి 8 వ తేదీ వరకు అందరూ లోపలికి పోతారని సంచలన కామెంట్స్ చేశారు. అక్రమాలన్నింటికీ తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని, ఎవరినీ వదిలిపెట్టబోమని మంత్రి స్పష్టం చేశారు. సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు .
గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని, ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్, ధరణి లాంటి నాలుగైదు కుంభకోణాలు ఉన్నాయన్నారు. "కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళి లోపే పేలుతుంది. అరెస్టు చేయలా.. జీవితకాలం జైలులో పెట్టాలా? అనేది చట్టం చూసుకుంటుంది. ఆస్తుల రికవరీ కూడా చట్టం పనే. మా నిర్ణయం కాదు. రాష్ట్ర సంపదను తమ తాతలు, తండ్రుల ఆస్తుల్లాగా అక్రమంగా సొంతం చేసుకున్నరు. వారంతా ఫలితాలు అనుభవిస్తారు” అని పొంగులేటి చెప్పారు. మాజీ మంత్రులు, వారి తొత్తులు మూసీ వెంట కబ్జాలు చేశారని.. అవి ఖాళీ చేయిస్తుంటే పెయిడ్ ఆర్టిస్ట్ లను పెట్టుకొని వాళ్లు, వీళ్లు ఏడ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నారన్నారు.
బావ, బావ మరుదులిద్దరూ పబ్బం గడుపుకోవడానికి మూసి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తప్పు చేస్తే ఉపేక్షించడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని, రాబోయే రెండు రోజుల్లో ఏం జరుగుతుందో మీరే చూస్తారని మంత్రి పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో పాటు , భూ ఆక్రమణలకు సంబదించిన ఫైల్స్ ఉన్నాయని, ఎవరూ తప్పించుకోకుండా పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇన్ని రోజులు పకడ్బందీ ఆధారాల కోసమే ఆగామని, ఇప్పటిదాకా జరిగింది ట్రయల్స్ మాత్రమేనని అసలు సంగతి ముందుందని మంత్రి పొంగులేటి తెలిపారు.