వరదలతో నష్టపోయిన మత్స్యకారులకు అండగా ఉంటాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వరదలతో నష్టపోయిన మత్స్యకారులకు అండగా ఉంటాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కూసుమంచి, వెలుగు: రాష్ట్రంలో వరదలతో నష్టపోయిన మత్స్యకారులను ఆదుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. మంగళవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో చేప పిల్లలను ఖమ్మం ఎంపీ రామసహాయం రఘరాంరెడ్డితో కలిసి వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరదలతో మత్స్యకారులు తీవ్రంగా నష్ట పోయారని, జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

వరదల్లో మత్స్యకారులు వాడుకునే వలలు, తెప్పలు కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. హైవే పక్కన వ్యాపారం చేసుకోవాలనుకుంటే షాపులకు కావాల్సిన సౌలతులు కల్పిస్తామని తెలిపారు. పాలేరు జలాశయం 1,748 హెక్టార్ల విస్తీర్ణంలో ఉందని, దీనిపై 1,696 మంది జీవనోపాధి పొందుతున్నారని చెప్పారు.

మత్స్యకారులు మరో 6 లక్షల చేప పిల్లలతో పాటు రొయ్యలు కావాలని కోరగా, ఫిషరీస్​ సెక్రటరీతో ఫోన్​లో మాట్లాడి ఇప్పించారు. అడిషనల్​ కలెక్టర్​ శ్రీజా, ఇరిగేషన్  డెవలప్​మెంట్​ చైర్మన్  మువ్వ విజయ్ బాబు, ఫిషరీస్  ఫెడరేషన్  చైర్మన్  మెట్టు సాయి కుమార్, ఖమ్మం ఆర్డీవో గణేశ్, ఫిషరీస్  డీడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.