పేదలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ భూముల పంపిణీపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

పేదలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ భూముల పంపిణీపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

హాలియా: డిసెంబర్ 9 న పేదలకు  ప్రభుత్వ భూములు పంచుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  త్వరలోనే భూమాతను తీసుకువచ్చి భూమి విషయంలో  రైతుకు ఎలాంటి భయం లేకుండా చేస్తామని చెప్పారు.  ఇవాళ నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ గ్రామంలో నిర్వహించిన భూమాత సర్వే పైలెట్ ప్రాజెక్టు స్కీమ్‎లో భాగంగా మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డి, నాగార్జునసాగర్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో  మంత్రి పాల్గొన్నారు.  నిరుపేదల జీవితాల్లో మార్పు కోసం రాష్ట్రంలో  ఇందిరమ్మ అమలు చేస్తామని చెప్పారు.

 ‘తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశాం. ఇక్కడి  రైతుల సమస్యలను పరిష్కారించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తం. ధరణి పోర్టల్‎తో బీఆర్ ఎస్ ప్రభుత్వం ఆటలు ఆడింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణినీ బంగాళా ఖాతంలో వేస్తామని సీఎం రేవంత్​రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారు.  త్వరలోనే  ప్రజలకు అనువైన ఆర్ఓఆర్ చట్టం అమలు చేస్తం. ఈ చట్టాల విషయంలో ప్రతిపక్ష పార్టీల సలహాలు సూచనలు స్వీకరిస్తాం. గత  ప్రభుత్వ తప్పిదలా వల్ల భూమి లేకున్నా పాస్ బుక్‎లు సృష్టించి రైతు బంధు  తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజమైన రైతులకు లబ్ధి జరుగుతుంది’ అని మంత్రి పొంగులేటి  శ్రీనివాసరెడ్డి అన్నారు. 

సాగర్‎కు 5 వేల ఇందిరమ్మ ఇళ్లు 

నాగార్జున సాగర్ నియోజక వర్గానికి 5 వేల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఇందిరమ్మ రాజ్యంలో  పేదలను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. తిరుమలగిరి సాగర్ మండలంలో 4300ఎకరాల్లో 1300 మంది రైతులకు  పట్టాలు ఉన్న భూమి లేదని ప్రభుత్వ  గుర్తించిందన్నారు. అటవీ భూములు అధికంగా ఉన్నాయని, అసలు రైతులకు న్యాయం జరగడం లేదనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ఫారెస్ట్, రెవెన్యూ శాఖల మధ్య వివాదం ఉన్న భూముల సమస్యలు పరిష్కారం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.