ఎకో టూరిజం హబ్‌‌‌‌గా ఇనుపరాతి గుట్టలు

ఎకో టూరిజం హబ్‌‌‌‌గా ఇనుపరాతి గుట్టలు
  • ధర్మసాగర్‌‌‌‌ బండ్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌కూ అడుగులు
  • ఎమ్మెల్యే కడియం విజ్ఞప్తితో డీపీఆర్‌‌‌‌ రెడీ చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశం
  • ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్న ఆఫీసర్లు
  • రిజర్వ్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌గా ప్రకటించి డెవలప్ చేయాలంటున్న ప్రజలు

హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్, కరీంనగర్‌‌‌‌ జిల్లా ప్రజలకు సుపరిచితమైన ఇనుపరాతి గుట్టలను ఎకో టూరిజం హబ్‌‌‌‌గా అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. హనుమకొండ జిల్లాలో ఏకైక అటవీ ప్రాంతమైన ఈ ఏరియా రిజర్వ్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌ ప్రక్రియ కాగితాలకే పరిమితం కావడం, టూరిజం స్పాట్‌‌‌‌గా మారుస్తామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోలేదు. తాజాగా స్టేషన్‌‌‌‌ ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవతో టూరిజం హబ్‌‌‌‌గా డెవలప్‌‌‌‌ చేసేందుకు ప్రపోజల్స్‌‌‌‌ రెడీ అవుతున్నాయి.

గురువారం జిల్లా ఇన్‌‌‌‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి నిర్వహించిన ఉమ్మడి వరంగల్‌‌‌‌ రివ్యూ మీటింగ్‌‌‌‌లో ఇనుపరాతి గుట్టలు, ధర్మసాగర్‌‌‌‌ బండ్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌కు కడియం ప్రపోజల్‌‌‌‌ పెట్టగా మంత్రి గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చారు. ఈ మేరకు డీపీఆర్​రెడీ చేయాలని అప్పటికప్పుడు ఆఫీసర్లను ఆదేశించారు. దీంతో హనుమకొండ జిల్లాలో ఎకో టూరిజం హబ్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌కు త్వరలోనే మోక్షం కలిగే అవకాశం కనిపిస్తోంది.

ఇనుపరాతి గుట్టల్లో రోప్‌‌‌‌వే, ట్రెక్కింగ్, క్యాంప్‌‌‌‌

హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల పరిధిలోని దాదాపు 4,880 ఎకరాల్లో ఇనుపరాతి గుట్టలు విస్తరించి ఉన్నాయి. హనుమకొండ జిల్లాకు ఉన్న ఏకైక ఫారెస్ట్‌‌‌‌ ఏరియా కూడా ఇదే. ఈ గుట్టలపై ఎలుగుబంట్లు, జింకలు, అడవి పందులతో సహా సుమారు 80కిపైగా పక్షి జాతులు, 25 రకాల సీతాకోకచిలుకల ఆవాసం ఉంటున్నాయి. గుట్ట మధ్య నుంచి బలపాలొద్ది అనే జాలు పారుతుంటుంది. తీగలొద్ది, జాలులాల అనే రెండు వాటర్‌‌‌‌ ఫాల్స్‌‌‌‌ కూడా ఉన్నాయి. ఈ మూడింటి నుంచి వచ్చే నీటితో గుట్ట కింది భాగంలో ఉన్న వ్యవసాయ భూములకు నీరు అందుతోంది.

అంతేగాక ఈ ఊటల నుంచి వచ్చే నీటిని తాగితే రోగాలు నయం అవుతాయన్న నమ్మకం కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో ఉంది. ఈ అటవీ ప్రాంతం మధ్యలో ఏనుగులమడుగు కూడా ఉంటుంది. నక్సల్స్‌‌‌‌ ఉద్యమ కాలంలో గుట్టు పైభాగంలో ఓ స్తూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా ట్రెక్కింగ్, రోప్‌‌‌‌వే, నైట్‌‌‌‌ క్యాంప్‌‌‌‌కు ఇక్కడ అనువైన ప్రాంతాలు ఉన్నాయి. దీంతోనే ఇనుపరాతి గుట్టలను టూరిజం స్పాట్‌‌‌‌గా డెవలప్‌‌‌‌ చేయాలన్న ప్రపోజల్స్‌‌‌‌ ఎప్పటినుంచో ఉన్నాయి. గతంలో అమ్రపాలి కలెక్టర్‌‌‌‌గా ఉన్న టైంలో ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లతో కలిసి ఇనుపరాతి గుట్టలపై ట్రెక్కింగ్‌‌‌‌ నిర్వహించి, ఈ ప్రాంతాన్ని టూరిజంపరంగా డెవలప్‌‌‌‌ చేస్తామని చెప్పారు.

కానీ ఆ తర్వాత ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉమ్మడి జిల్లా రివ్యూలో ఇనుపరాతి గుట్టలను ప్రస్తావిస్తూ రోప్‌‌‌‌ వే, ట్రెక్కింగ్, క్యాంప్‌‌‌‌ల ఏర్పాటుకు సదుపాయాలు కల్పించాలని మంత్రి పొంగులేటిని కోరారు. అంతేగాకుండా హంటర్‌‌‌‌ రోడ్డులోని జూ పార్క్‌‌‌‌ను దేవునూరు ఇనుపరాతి గుట్టల్లోకి మార్చాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మంత్రి పొంగులేటి ఆదేశాలతో ఆయా పనులకు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు.

రిజర్వ్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌గా ప్రకటించాలని డిమాండ్‌‌‌‌

ఇనుపరాతి గుట్టల్లోని అటవీ ప్రాంతాన్ని రిజర్వ్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌గా ప్రకటించాలని ఎప్పటి నుంచో డిమాండ్‌‌‌‌ వినిపిస్తోంది. ఈ మేరకు నాలుగేండ్ల కింద అటవీశాఖ  అధికారులు డిజిటల్‌‌‌‌ సర్వే కూడా నిర్వహించారు. కానీ ఆ ప్రక్రియ తర్వాత ముందుకు కదలకపోవడం, ఫారెస్ట్‌‌‌‌ ఏరియాకు సరైన హద్దులు కూడా లేకపోవడంతో తరచూ ఆక్రమణలు జరుగుతున్నాయి.

అంతేగాకుండా దేవునూరు సమీపంలోని ఫారెస్ట్‌‌‌‌ భూమిలో సుమారు 142 ఎకరాలకు కొంతమంది అధికారులు ప్రైవేట్‌‌‌‌ వ్యక్తుల పేరున పట్టాలు ఇవ్వడంతో వాటిపై వివాదం నడుస్తోంది. దీంతో పాటు అటవీ ప్రాంతంలో ఉన్న విలువైన ఖనిజ నిక్షేపాలను కొల్లగొట్టేందుకు కొందరు వ్యక్తులు మైనింగ్‌‌‌‌ కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ కారణంగా ఈ ఏరియాను రిజర్వ్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌గా ప్రకటించి, హద్దులు నిర్ణయించాలని స్థానికులు, పర్యావరణ ప్రేమికులు డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు. ఎకో టూరిజం హబ్‌‌‌‌గా డెవలప్‌‌‌‌ చేసేందుకు కసరత్తు చేస్తున్న లీడర్లు, రిజర్వ్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌ అంశంపైనా దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

టూరిస్ట్‌‌‌‌ స్పాట్‌‌‌‌గా ధర్మసాగర్‌‌‌‌ బండ్‌‌‌‌

ఇనుపరాతి గుట్టలతో పాటు ధర్మసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ను బండ్‌‌‌‌గా డెవలప్‌‌‌‌ చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంత్రి పొంగులేటిని కోరారు. వరంగల్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డుకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో దీనిని డెవలప్‌‌‌‌ చేస్తే టూరిస్టులకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఈ మేరకు కుడా ఫండ్స్‌‌‌‌తో ధర్మసాగర్‌‌‌‌ బండ్‌‌‌‌ను డెవలప్‌‌‌‌ చేయనున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.

ఇందులో బండ్‌‌‌‌ చుట్టూ వాకింగ్‌‌‌‌ ట్రాక్, ఎల్‌‌‌‌ఈడీ లైట్లు, పిల్లలకు ఆటవస్తువులు, బెంచీలు, టాయిలెట్స్‌‌‌‌ ఇలా అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రపోజల్స్‌‌‌‌ రెడీ చేస్తున్నారు. వాటికి అదనంగా వాటర్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కడియం కోరగా ఆ పనులకు సైతం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి పచ్చజెండా ఊపారు. బండ్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌కు డీపీఆర్‌‌‌‌ రెడీ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఆ పనులు వెంటనే చేపట్టి త్వరగా పూర్తి చేస్తే ధర్మసాగర్‌‌‌‌ బండ్‌‌‌‌ పర్యాటకులతో కళకళలాడే అవకాశం ఉంది.