రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు

రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు

హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక్కో ఇంటికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవార ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళా పేరు మీదనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని.. ఈ ఇండ్లకు నాలుగు దశల్లో లబ్దిదారులకు చెల్లింపులు చేస్తామని క్లారిటీ ఇచ్చారు. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్దిదారుని బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. 

ఈ పథకం కింద నిర్మించే ఇండ్లు క‌నీసం 400 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం, వంట‌గ‌ది, టాయిలెట్ సౌక‌ర్యాల‌ను క‌లిగి ఉంటాయన్నారు. గ‌త ప్రభుత్వంలో ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్యవ‌స్ధ ఉండేదని.. ఇప్పుడు ఆ వ్యవ‌స్ధను ర‌ద్దుచేసి లబ్దిదారులే ఇళ్లు నిర్మించుకునేలా అవకాశం కల్పిస్తున్నామన్నారు. లబ్దిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చ‌ద‌ర‌పు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా నిర్మించుకోవచ్చు సూచించారు. రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ  మోడల్ హౌస్ నిర్మాణాలను చేపడతామని అన్నారు. 

Also Read:-గుడ్న్యూస్..హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్

ఇందిరమ్మ ఇండ్ల పథకం అమ‌లుకు ఉన్న అవ‌రోధాల‌ను అధిగ‌మిస్తూ అమ‌లుకు అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను వేగవంతం చేసిందని తెలిపారు. “ఇల్లు లేని పేద‌ల‌కు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం, కాంగ్రెస్ అంటే ఇందిర‌మ్మ ఇండ్లు, ఇందిర‌మ్మ ఇండ్లకు కాంగ్రెస్ పేటెంట్. ఈ రోజు కూడా రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా, ఏ తండాకు పోయినా, ఏమారుమూల ప్రాంతానికి పోయినా ఇందిరమ్మ ఇళ్ళే కనబడతాయి. ఈ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు ఒక వంతు అయితే, మేం కట్టించే ఇందిరమ్మ ఇళ్లు మరో వంతు. మేం గర్వంగా చెబుతున్నాం ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తామని చెబుతున్నాం. 

ల‌బ్దిదారుల ఎంపిక పార‌ద‌ర్శకంగా ఉండేలా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా రాజకీయ ప్రమేయానికి తావు లేకుండా అర్హులైన వారిని ఎంపిక చేయడానికి వీలుగా మొబైల్ యాప్‌ను రూపొందించాం. ఈ యాప్‌ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం (డిసెంబర్ 5) ఆవిష్కరించనున్నారు. లబ్దిదారుల ఆర్థిక, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం, కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన భూమి వివరాలు వంటి అంశాలు ఈ యాప్‎లో ప్రధానంగా ఉండనున్నాయి. అర్హులైన పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించేందుకు వీలుగా ప్రతి గ్రామం, వార్డుల‌లో ఇందిర‌మ్మ ఇండ్ల కమిటీల‌ను ఏర్పాటు చేశాం’’ అని పేర్కొన్నారు

హౌసింగ్ శాఖ పున‌రుద్దర‌ణ‌

పేద‌ల‌కు ఇండ్లు నిర్మించే హౌసింగ్ శాఖ‌ను గ‌త ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని.. ఆ విభాగాన్ని మూసివేసి ఉన్న ఉద్యోగుల‌ను ఇత‌ర శాఖ‌ల‌లో విలీనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి. ఈ నేప‌ధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వేస్తూ ఈ శాఖ‌ను పునరుద్ధరించి ల‌బ్దిదారుల ఎంపిక నుంచి ఇండ్ల నిర్మాణం, ప‌ర్యవేక్షణ వ‌ర‌కు అవ‌స‌ర‌మైన యంత్రాంగాన్ని స‌మ‌కూర్చుకుందని తెలిపారు. 296 మంది ఉద్యోగులను తిరిగి నియమించడం ద్వారా హౌసింగ్ కార్పొరేషన్‌ను బలోపేతం చేశామన్నారు.