ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి శుభవార్త

ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి శుభవార్త

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కోసం తయారు చేసిన యాప్ పూర్తి అయ్యిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిట్ చాట్‌లో చెప్పారు. ఫస్ట్ ఫేజ్‍లో నాలుగున్నర లక్షల ఇండ్ల పంపిణీ చేయనున్నామన్నారు ఆయన. మరో 4ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. నవంబర్ 6 లేదా 7 నుంచి లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని మంత్రి తెలిపారు. నవంబర్  20లోపే అర్హులైన లబ్దిదారుల ఫైనల్ లిస్ట్ ఎంపిక అవుతుందని ఆయన అన్నారు.
నవంబర్ 25 నుంచి గ్రౌండ్ లోకి వెళ్లి పనులు ప్రారంమైయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. కోర్ అర్బన్ తప్పా.. సాధ్యమైనంత వరకు లబ్ధిదారుల చేత ఇండ్ల కట్టడాలు ఉంటాయన్నారు. వారికి నాలుగు విడతల్లో రూ.5లక్షల నిధులు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

ఇంటి స్థలం ఉన్నవాళ్లకు రూ.5లక్షలు, లేని వాళ్లకు 75 గజాల జాగలో ఇందిరమ్మ ఇట్లు కట్టిస్తామని ఆయన అన్నారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ పూర్తిగా కూలిపోయిందని.. ఇప్పుడు మళ్లీ పునరుద్ధరణ చేస్తున్నామని ఆయన తెలిపారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ లలో సిబ్బంది కొరత ఉంది. గ్రామ సభలు పెట్టి పెద్దల్లో బహుపేదలకు మొదటి దశ ఇండ్ల పంపిణీ చేస్తామన అన్నారు రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి. రాజకీయ ప్రమేయం లేకుండా ఇండ్ల పంపిణీ ఉంటుంది. పార్టీలతో సంబంధం లేకుండా నిజమైన పేదలకు న్యాయం చేస్తాం. ఇందిరమ్మ కమిటీ అయినా, ఎమ్మెల్యే అయినా లబ్ధిదారుని ఎంపిక ఎమ్మార్వో నిర్ధారణ చేయాల్సిందే అని ఆయన వివరించారు. 

ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. గ్రీన్ చానెల్ లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరుగుతుందని చెప్పుకొచ్చారు ఆయన. ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభంలో రూ.లక్ష, ఫిల్లర్స్ రూ.1.25 లక్షలు, స్లాబ్ కట్టేటప్పుడు రూ.1.75 లక్షలు, తర్వాత ఇళ్లు పూర్తి అయ్యాక రూ.1లక్ష డెరెక్ట్ గా లబ్ధిదారుని అకౌంట్లో జమ చేస్తామని అన్నారు. లబ్ధి ఎంపికలో రేషన్ కార్డు తప్పనిసరి కాదని తేల్చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభానికి కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుంది అనే సంకేతాలు ఇప్పటి వరకు ఉన్నాయి. కేంద్రం నుంచి నిదులు ఇస్తే మంచిది.. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇండ్లను కట్టిస్తామని తెలియజేశారు.