
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మహబూబాబాద్, వెలుగు : బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నాటకీయంగా అరెస్టు చేశారని విమర్శించారు. ఎంపీ ఎన్నికల్లో సానుభూతి , కాంగ్రెస్ పార్టీ పై బురద జల్లడం కోసం సంబంధం లేని అంశాల్లో బీఆర్ఎస్ ధర్నాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్ లో మహబూబాబాద్ ఎమ్మెల్యేభూక్య మురళి నాయక్ అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.
వంద రోజుల కాగ్రెస్ ప్రజా పరిపాలన లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేస్తూ.. అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్టు తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామన్నారు. గత ప్రభుత్వ లోపాల వల్లే నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, మహబూబాద్ ఎమ్మెల్యేభూక్య మురళి నాయక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.