తెలంగాణ ఇచ్చిన సోనియా కాళ్లు మొక్కిన విషయం మరిచావా కేసీఆర్..మంత్రి పొంగులేటి

తెలంగాణ ఇచ్చిన సోనియా కాళ్లు మొక్కిన విషయం మరిచావా కేసీఆర్..మంత్రి పొంగులేటి

వరంగల్: కాంగ్రెస్ పెద్ద విలన్ లా చూపిస్తూ బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు.. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా..? అని ప్రశ్నించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ ఇచ్చిన సోనియా కాళ్లు మొక్కిన విషయం అప్పడే మర్చిపోయావా కేసీఆర్ అని అన్నారు. రెండుసార్లు అధికారం ఇస్తే బీఆర్ ఎస్ ఏం చేసిందో ప్రజలకు తెలుసన్నారు. 

కేసీఆర్అనుభవంతో సలహాలు ఇస్తారనుకుంటే..అసెంబ్లీకి రాకుండా పోయారని అన్నారు. ‘‘ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఏనాడైన సెక్రటేరియట్ కు వచ్చారా.. ఫాంహౌజ్ నుంచి దొరలపాలన నడిపారు.. ఏనాడైనా ప్రజాస్వామ్య పద్దతిలో పాలనా చేశారా’’ అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. 
ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ కాంగ్రెస్ పై విషం చిమ్మారని పొంగులేటి మండిపడ్డారు. 

కాంట్రాక్టర్లకు బాకీలు పెట్టిందే బీఆర్ ఎస్ ప్రభుత్వం అని మంత్రి పొంగులేటి అన్నారు. బీఆర్  ఎస్ హయాంలో కాంట్రాక్టర్లకు 80వేల కోట్లు పెండింగ్ పెట్టారని అన్నారు. సర్పంచులకు బిల్లులు చెల్లించకుండా మోసం చేసింది బీఆర్ ఎస్ అన్నారు. ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ కు రూ. 1500 కోట్ల పార్టీ ఫండ్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. 

అధికారం కోసం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని పొంగులేటి విమర్శించారు. ఆనాడు ఖమ్మం సభకు రాహుల్ గాంధీ వస్తే బీఆర్ ఎస్ ప్రభుత్వం నిర్భంధించలేదా అని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వాలని మేం కోరితే మీరు తిరస్కరించలేదా అని అన్నారు. ప్రజాస్వామ్యంపై మాకు నమ్మకం ఉంది. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. -ఫోన్ ట్యాపింగ్ విషయంపై మాట్లాడిన పొంగులేటి.. మొగుడు పెళ్లాల మాటలు కూడా రహస్యంగా విన్నారని విమర్శించారు.