
ఖమ్మం రూరల్, వెలుగు: ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు మేలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం తిరుమలాయపాలెం మండలంలో పర్యటించారు. ఇస్లావత్ తండా, మేడిదపల్లి, తెట్టెలపాడు, పిండిప్రోలు, తిరుమలాయ పాలెంలలో నిర్మించిన సీసీ రోడ్లను, సహకార సంఘం గోదాం, కార్యాలయ భవనాన్ని, పిండిప్రోలులో పీఏసీఎస్ గోదాం, అగ్రి ఔట్లెట్స్ ను ప్రారంభించారు. పాలేరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో నేడు మంత్రిగా ఉన్నానని, తాను కొత్తగూడెం వెళ్తాననే ప్రచారం అబద్ధమని తెలిపారు. ప్రతీ గ్రామంలో విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందిస్తామన్నారు.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ, గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ.రూ. 8 వేల కోట్ల రైతుబంధు నిధులు విడుదల చేశామని, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. అనంతరం 56 మందికి సీఎంఆర్ఎఫ్చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్కార్పొరేషన్చైర్మన్ మువ్వా విజయ్ బాబు, జిల్లా సహకార అధికారి గంగాధర్, ఆర్అండ్ బీ ఎస్ఈ యుగంధర్, ఇరిగేషన్ ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, ఏడీఏ సరిత, డివిజినల్ పంచాయతీ అధికారి రాంబాబు, ఎంపీడీవో సిలార్ సాహెబ్, ఇన్చార్జి తహసీల్దార్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.