సంక్షేమ పథకాలకు కొత్త దరఖాస్తులు ఎన్ని వచ్చినా తీసుకుంటామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వరంగల్ లో మంత్రి కొండా సురేఖతో కలిసి నాలుగు స్కీంల ప్రారంభోత్సవం పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన... ఒక వేళ అనర్హులకు పథకాలు వస్తే మధ్యలోనే నిలిపివేస్తామని చెప్పారు. ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ భయపడి చేతులు ఎత్తేయడం లేదన్నారు. 45వేల కోట్ల రూపాయల ఖర్చుతో నాలుగు పథకాలు ప్రారంభించామని చెప్పారు. పంటకు యోగ్యమైన ప్రతీ ఎకరాకు రైతు భరోసా అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పింక్ కలర్ డ్రెస్ వేస్తే లక్షల రూపాయల రైతు బందు ఇచ్చిందని ఆరోపించారు.
భూమి లేని పేదల పరిస్థితి చూసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామన్నారు పొంగులేటి. ఇంటింటికి సన్నబియ్యం త్వరలో పంపిణీ చేస్తామన్నారు. ఇల్లు లేని పేదలకు మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు. అర్హులు ఎవరున్నా సంక్షేమ పథకాలు అందుతాయన్నారు.
పదేళ్లు గులాబి నేతలకు పేదలపై ఎంత చిత్తశుద్ధి ఉందో అందరికీ తెలుసన్నారు. రైతుల పేరుతో, నిరుద్యోగుల పేరుతో నాలుగు ఈగలు రాష్ట్రంలో తిరుగుతున్నాయని విమర్శించారు. మంచి పనిని మెచ్చుకోకున్నా, ఆరోపణలు చేయడం మానుకోండని సూచించారు. అర్హులైన పేదలు ఎవరికీ రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఇంటింటికి వచ్చి పథకాలు అందించడం ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు పొంగులేటి.