భూ భారతిని ప్రజలకు అంకితం ఇస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

భూ భారతిని ప్రజలకు అంకితం ఇస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

పినపాక/మణుగూరు, వెలుగు: ఈ నెల 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా భూ భారతిని ప్రజలకు అంకితం ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. శుక్రంవారం పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో పర్యటించారు. అశ్వాపురం మండలం సీతారాంపురం ఆర్అండ్ బీ రోడ్డు నుంచి బిజీ కొత్తూరు వరకు బీటీ రోడ్డు, మణుగూరు మండలంలోని సమితి సింగారంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అదనపు తరగతి గదులు, కుర్షం వారి గూడెం రోడ్డు నుంచి జగ్గారం వరకు బీటీ రోడ్డు, గొల్ల కొత్తూరు కాలనీ హైలైవెల్ బ్రిడ్జి, రామానుజవరం -పగిడేరు రోడ్డు హై లెవెల్ బ్రిడ్జి, ఉప్పాక బ్రిడ్జి నుంచి పోతిరెడ్డిపల్లి వరకు బీటీ రోడ్డు, పోతురెడ్డిపల్లి నుంచి కింది గుంపు వరకు బీటీ రోడ్డు, మల్లారం నుంచి వెంకటేశ్వరపురం వరకు బీటీ రోడ్డు  పనులను ప్రారంభించారు.  పినపాకలో నూతనంగా నిర్మించిన పీహెచ్​సీ భవనాన్ని ప్రారంభించారు. 

మణుగూరు మండలంలోని బొజ్జవారి గుంపు కూనవరం రోడ్డులోని ఎస్టీ కోయ తెగకు చెందిన సన్నబియ్యం లబ్ధిదారు​ వంక శివలక్ష్మి ఇంట్లో భోజనం చేశారు.  అనంతరం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో విలేకరులతో మాట్లాడారు. పినపాక నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. పులుసు బొంత ప్రాజెక్టుకు సీఎం  రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి చేతులమీదుగా త్వరలో శంకుస్థాపన ఉంటుందన్నారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, నాయకులున్నారు.

గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం

బూర్గంపహాడ్, వెలుగు: గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. బూర్గంపహాడ్ పంచాయతీ పరిధిలోని గౌతంపురం ముత్యాలమ్మ ఆలయం నుంచి సోంపల్లి వరకు నిర్మించనున్న బీటీ రోడ్దుకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. బూర్గంపహాడ్ కు మంజూరైన వంద పడకల ఆస్పత్రిని వేరే ప్రాంతానికి తరలించొద్దని, పోలవరం ముంపు గ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతూ పలువురు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి సారపాక ముత్యాలమ్మ ఆలయంలో పూజలు చేశారు. 

సబ్ రిజిస్ట్రార్ పై మంత్రికి ఫిర్యాదు

బూర్గంపహాడ్ సబ్ రిజిస్ట్రార్ పై మంత్రి శ్రీనివాస్​రెడ్దికి స్థానికులు ఫిర్యాదు చేశారు. కార్యాలయానికి మద్యం సేవించి, వస్తున్నారని, వివాహ సర్టిఫికెట్​కోసం వచ్చే వారిని లంచాల పేరిట వేధిస్తున్నారని ఆరోపించారు. 

రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి

కరకగూడెం, వెలుగు: మండలంలో శుక్రవారం రెవెన్యూ శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, మహబూబాబాద్​ ఎంపీ బలరాం నాయక్ పర్యటించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులతో కలిసి జై బాపు, జైభీమ్, జై సంవిధాన్​పాదయాత్రలో పాల్గొన్నారు.    రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ప్రజలకు  పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.