ఎవరికీ పైసా లంచం ఇవ్వొద్దు : మంత్రి పొంగులేటి

ఎవరికీ పైసా లంచం ఇవ్వొద్దు : మంత్రి పొంగులేటి
  • పేదల గుమ్మం వద్దకే ప్రభుత్వ పథకాలు: మంత్రి పొంగులేటి
  • అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినట్లు తేలితే క్యాన్సిల్​ చేస్తం
  • అర్హులైన ప్రతి ఫ్యామిలీకి రేషన్​ కార్డు.. త్వరలోనే ఇంటింటికీ సన్నబియ్యం
  • గత ప్రభుత్వం దొరికిన కాడికి అప్పులు చేసి ప్రజలను మభ్యపెట్టిందని వ్యాఖ్య

హనుమకొండ, హసన్​పర్తి, ధర్మసాగర్, వెలుగు: సంక్షేమ పథకాల కోసం ఎవరికీ పైసా లంచం ఇవ్వనక్కర్లేదని, అర్హులైన నిరుపేదలందరికీ గుమ్మం వద్దనే సంక్షేమ పథకాలు వస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. గ్రామసభల్లోనే అర్హులను గుర్తించామని, ఎక్కడైనా అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినట్టు తెలిస్తే వాటిని మధ్యలోనే క్యాన్సిల్​ చేస్తామని స్పష్టం చేశారు. కొత్తగా ఎన్ని దరఖాస్తులైనా తీసుకుంటామని, పార్టీలు, కులమతాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. 

అర్హులకు రేషన్​ కార్డులు ఇవ్వడంతోపాటు త్వరలోనే సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. హనుమకొండ జిల్లా హసన్​ పర్తి మండలం పెంబర్తి, ధర్మసాగర్​ మండలం క్యాతంపల్లిలో కొత్తగా అమలు చేస్తున్న స్కీమ్​లను మంత్రి పొంగులేటి ఆదివారం ప్రారంభించారు. లబ్ధిదారులకు అలాట్​మెంట్​పేపర్లను అందజేశారు.

 మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్​ నాగరాజు, నాయిని రాజేందర్​ రెడ్డి, కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం అంటే దేశానికి రోల్​ మోడల్​ అని అన్నారు. రాష్ట్రంలో రూ.45 వేల కోట్లతో నాలుగు పథకాలను ప్రారంభించామని, అర్హులైన లబ్ధిదారులకు మార్చి 31లోగా సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు అదనంగా ఇండ్లు

2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షలకుపైగా ఇండ్లు ఇచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి చెప్పారు. గత పదేండ్లలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు అదనంగా ఇండ్లు ఇవ్వాలని కేబినెట్​ నిర్ణయం తీసుకుందన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్​ ఏం చెబితే అదే జరిగేదని, నాలుగు గోడల మధ్య కూర్చుని గులాబీ పార్టీ తొత్తులకే పథకాలు ఇచ్చారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. 

కానీ ఇప్పుడు గ్రామసభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తున్నామన్నారు. గతంలో పింక్​ డ్రెస్​ వేసుకునోళ్లందరికీ రైతు బంధు పేరిట రూ.కోట్లు దోచిపెట్టారని విమర్శించారు. కానీ ఇప్పుడు సాగు చేసే భూమికే రైతు భరోసా అందిస్తామన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. లబ్ధిదారుల్లో అనర్హులు లేకుండా చూస్తామని అన్నారు. ఆయిల్​ సీడ్స్​, గ్రోయర్స్​ ఫెడరేషన్​ చైర్మన్​ జంగా రాఘవరెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామ్​ రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.