వర్షాలపై అలర్ట్​గా ఉండండి: మంత్రి పొంగులేటి

వర్షాలపై అలర్ట్​గా ఉండండి: మంత్రి పొంగులేటి
  • విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే  నిర్ణయం కలెక్టర్లకే: మంత్రి పొంగులేటి
  • కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​లో రెవెన్యూ శాఖ మంత్రి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో  కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, జనజీవనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాల న్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, నూతన రెవెన్యూ చట్టం (ఆర్వోఆర్​) -–2024 ముసాయిదా, ధరణి దరఖాస్తులు, ఎల్ఆర్ఎస్ తదితర అంశాలపై  సీఎస్​ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో మంగళవారం  ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్​రెడ్డి మాట్లాడారు.  వచ్చే ఐదు రోజుల్లో వర్షాలను దృష్టిలో పెట్టుకొని, స్థానిక పరిస్థితులను బట్టి  విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే నిర్ణయాన్ని కలెక్టర్లు తీసుకోవాలని సూచించారు. గత రాత్రి నుంచి గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినా.. వీలైనంత మేరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పని చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.  ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలిసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.  

10 రోజుల్లో ధరణి అప్లికేషన్లు పరిష్కరించాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న నూతన రెవెన్యూ చట్టం –2024 పై ప్రజల నుంచి విస్తృత స్థాయిలో అభిప్రాయ సేకరణ జరపాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగా ఈ నెల 23, 24వ తేదీల్లో ఆయా జిల్లాల్లో స్థానిక పరిస్థితులను బట్టి  వివిధ రంగాల మేధావులతో వర్క్ షాప్ నిర్వహించాలని సూచించారు. ధరణి సమస్యలపై గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులతో పాటు ఇటీవల కాలంలో కొత్తగా వచ్చిన అప్లికేషన్లను వచ్చే పదిరోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. తిరస్కరించిన దరఖాస్తులకు సరైన కారణాలను తెలియజేయాలని సూచించారు. ముఖ్యంగా రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో దరఖాస్తుల పెండింగ్ అధికంగా ఉందని, ఈ జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ను ఆదేశించారు. లక్షాలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే లేఅవుట్ రెగ్యులరైజేషన్  ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరణ జరగాలని, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎల్ఆర్ఎస్ క్షేత్రస్థాయి తనిఖీల కోసం స్పెషల్ టీమ్ లతో పాటు హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 

మొత్తం ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ను పర్యవేక్షణ అధికారిగా నియమించాలని సీఎస్ కు సూచించారు. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో  అవసరమైన మేరకు డాక్యుమెంట్లు ఇవ్వకుంటే.. ఇప్పుడు తీసుకొని  ఎల్ఆర్ఎస్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక యాప్​ లో అప్​లోడ్​ చేయాలని అన్నారు.  మొదటి దశలో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి జిల్లాలో వంద ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. ఇందులో ఎదురయ్యే మంచి, చెడులను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. 2020 లో గత బీఆర్ఎస్​ ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ కోసం దాదాపు 25 లక్షల దరఖాస్తులు వచ్చాయని, గత  4  ఏండ్లుగా ఈ దరఖాస్తులు ఎలాంటి పరిష్కారానికి నోచుకోలేదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అత్యంత ప్రాధాన్యత క్రమంలో  పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు.