రైతుల ముసుగులో బీఆర్ఎస్ నేతల దౌర్జన్యం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రైతుల ముసుగులో బీఆర్ఎస్ నేతల దౌర్జన్యం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • లగచర్ల ఘటనలో కాస్త ఓపిక పడితే నిజాలన్నీ బయటకొస్తయ్ : పొంగులేటి
  • ఇంకా చేయాల్సిన రుణమాఫీ రూ.13 వేల కోట్లు.. త్వరలోనే రైతు భరోసా ఇస్తామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు : రైతుల ముసుగులో కలెక్టర్, అధికారులపై బీఆర్ఎస్ నేతలు దౌర్జన్యం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లగచర్ల ఘటనకు సంబంధించి కాస్త ఓపిక పడితే నిజాలన్నీ బయటకొస్తాయని చెప్పారు. బుధవారం గాంధీభవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పొంగులేటి పాల్గొన్నారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ‘‘రైతుల ముసుగులో అధికారులపై దాడి చేసింది ఎవరు? వారి వెనుక ఎవరెవరు ఉన్నారు? అనే దానిపై త్వరలోనే వివరాలన్నీ బయటపెడ్తం. బీఆర్ఎస్ ముసుగు తొలగిస్తాం” అని పొంగులేటి తెలిపారు.

ప్రజలకు మంచి చేద్దామని అనుకుంటున్న ప్రభుత్వాన్ని, అధికారులను కావాలనే కొందరు బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ముఖాముఖి కార్యక్రమంలో ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు, ధరణి సమస్యలపై అర్జీలు వచ్చాయి. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఆశ చూపింది. అందుకే ప్రజలు వీటిపైనే ఎక్కువగా అర్జీలు ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం  మొదట సొంతంగా భూమి ఉన్నోళ్లకు రూ.5 లక్షలు ఇస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. గ్రామ సభలో అర్హుల ఎంపిక జరుగుతుంది. ఇందులో పైరవీలకు తావుండదు” అని చెప్పారు. 

300 అర్జీలు.. 

కొత్త ఆర్వోఆర్ చట్టంతో భూసమస్యలన్నీ పరిష్కరిస్తామని పొంగులేటి తెలిపారు. కొత్త చట్టం వివరాలను అసెంబ్లీలో వెల్లడిస్తామని, ప్రతిపక్ష నేతల సలహాలు కూడా తీసుకుంటామని చెప్పారు. ధరణి బాధ్యతలను ఇటీవల ఎన్ఐసీకి అప్పగించామని పేర్కొన్నారు. ఇంకా రూ.13 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉందని, త్వరలోనే రైతు భరోసా కూడా ఇస్తామని ప్రకటించారు. ‘‘అప్పులు చేస్తూ తెలంగాణ ధనిక రాష్ట్రం అని మేం చెప్పలేం. ప్రతిపక్షాలు ఎంత రెచ్చగొట్టినా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం. రైతుల ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటాం.

దీనికోసం బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను జైల్లో పెట్టిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు పచ్చ కండువాలతో రైతుల వద్దకు వస్తున్నారు” అని విమర్శించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ పై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మాట్లాడారని తెలిపారు. కాగా, ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా పొంగులేటికి 300 అర్జీలు వచ్చాయి.

అందులో 150 అర్జీలపై అక్కడికక్కడే అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించారు. ఓ మాజీ సైనికుడు తన భూ సమస్యపై మంత్రికి అర్జీ ఇవ్వగా వెంటనే స్పందించి.. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్​తో ఫోన్​లో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు.