- జనం సొమ్ము కాజేసిన వారిపై చర్యలు తప్పవు: మంత్రి పొంగులేటి
- మొన్న కవితకు బెయిల్ కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్లు పట్టుకున్నడు
- ఇప్పుడు కేసుల్లో నుంచి బయటపడేందుకు చక్కర్లు కొడ్తున్నడు
- ఒక్క కేసుకే ఇంత కంగారు పడితే.. అన్ని కేసులుబయటపెడ్తే అంతరిక్షంలో దాక్కుంటరేమో
- తాను పేల్చబోయే బాంబేందో కేటీఆర్‌కు తెలుసని వ్యాఖ్య
ఖమ్మం రూరల్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఎవరి కాళ్లు మొక్కి ఏం లబ్ధిపొందుదామని ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘లిక్కర్ స్కామ్ కేసులో కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్లు పట్టుకుని తన చెల్లికి బెయిల్ పొందినట్లుగానే ఫార్ములా ఈ–రేస్ కోసం విదేశీ సంస్థలకు రూ.55 కోట్లను మళ్లించిన కేసు నుంచి కాపాడుకునేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారా? ఫార్ములా ఈ–రేస్ నిర్వహణలో నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి విచారణ బాధ్యతలు అప్పగించింది. అన్ని నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి” అని స్పష్టం చేశారు. సోమవారం ఖమ్మం జిల్లా చిన్న వెంకటగిరిలో అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫార్ములా ఈ–రేస్‌కు సంబంధించి నాడు ఎంవోయూ కుదుర్చుకోకముందే కేటీఆర్ నిధులను మళ్లించారని ఆరోపించారు. కేసులో ప్రజాప్రతినిధిని విచారించేందుకు గవర్నర్ అనుమతి ఉండాలని, అందుకే గవర్నర్ అనుమతిని ఏసీబీ కోరిందని.. రేపో మాపో గవర్నర్ అనుమతి వస్తుందని అనుకుంటున్నామని, ఆ విషయాన్ని గ్రహించిన కేటీఆర్ ఢిల్లీకి చక్కర్లు కొడ్తున్నారని ఆయన అన్నారు. కేసుల మాఫీ కోసమే కేటీఆర్ ఢిల్లీ బాటపట్టారని విమర్శించారు. ‘‘ఢిల్లీలో అంబానీ, అదానీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ పెద్దలను కలిసి తనను ఫార్ములా -ఈ– రేస్ కేసు నుంచి తప్పించాలని ప్రాధేయపడేందుకే కేటీఆర్ ఢిల్లీకి పోయిండు. కవితకు లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఎలా వచ్చిందో.. ఢిల్లీలో ఎవరిని కలిశారో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి.
ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రితో కేటీఆర్‌కు ఏం పని? కేసుల మాఫీ కోసమే ఆయన ఢిల్లీకి చక్కర్లు కొడ్తున్నడు. బీఆర్ఎస్పై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ఒక్క కేసుకే ఇంత కంగారు పడితే.. అన్ని కేసులు బయటపెడితే అంతరిక్షంలో దాక్కుంటారేమో” అని వ్యాఖ్యానించారు. తాను పేల్చబోయే బాంబేంటో కేటీఆర్ కు తెలుసని మంత్రి అన్నారు. పేదలకు చెందాల్సిన ఆస్తులను కొల్లగొట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
పీకల్లోతు అప్పుల్లో ఉన్నా స్కీమ్స్ ఆపడం లేదు
పీకల్లోతు అప్పుల్లో ఉన్నా పథకాలను అపడం లేదని, రైతులకు రుణమాఫీ చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. 27 రోజుల్లోనే రూ. 18 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిందని, ఇంకా13 వేల కోట్ల రుణాల మాఫీని డిసెంబర్లో పూర్తి చేస్తుందని చెప్పారు. వచ్చే నాలుగేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు.