బయటపడాల్సినవి ఇంకా చాలా ఉన్నయ్..కేటీఆర్ తప్పుచేయకపోతే కోర్టుకెందుకు పోయిండు: మంత్రి పొంగులేటి

బయటపడాల్సినవి ఇంకా చాలా ఉన్నయ్..కేటీఆర్ తప్పుచేయకపోతే కోర్టుకెందుకు పోయిండు: మంత్రి పొంగులేటి
  • ఇప్పటి వరకు వేసిన కేసులు, కమిషన్లు బీఆర్ఎస్​ అడిగినవే
  • కేసీఆర్ ఏ కేసులో ఉన్నా.. హరీశ్ అక్కడ ఉంటరు 
  • డిసెంబర్ నుంచి రియల్​ఎస్టేట్ పుంజుకుంటున్నదని  వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా–ఈ రేస్​ కేసులో ఎలక్టోరల్​ బాండ్స్​మాత్రమే కాదని.. బయటపడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. ఒకవేళ కేటీఆర్ తప్పు చేయకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తప్పు ఎప్పటికైనా బయటపడుతుందని.. వ్యవస్థల ముందు బలప్రదర్శన చేయడం సరికాదన్నారు.  ఇప్పటి వరకు వేసిన కేసులు, విచారణ కమిషన్లు బీఆర్ఎస్​ వాళ్లు కోరినవేనని మంత్రి స్పష్టం చేశారు. మంగళవారం సెక్రటేరియెట్​లో మంత్రి పొంగులేటి మీడియాతో చిట్​చాట్ ​చేశారు.

క్వాష్​ పిటిషన్​పై హైకోర్టు తీర్పు తరువాత కేటీఆర్ చేసిన ట్వీట్ పై పొంగులేటి సెటైరికల్ గా స్పందించారు. కేటీఆర్ మారలేదని.. కానీ, ఆయన రైటర్ మారినట్లున్నారని అన్నారు. సీఎం రేవంత్​ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.   కేసీఆర్ ఏ కేసులో ఉన్నా.. హరీశ్ అక్కడ ఉంటారని వ్యాఖ్యానించారు. ఫార్ములా-ఈ రేస్​ కేసులో అర్వింద్ కుమార్ నిజాలు చెప్తే అన్ని బయటకు వస్తాయన్నారు. విద్యుత్ కమిషన్ రిపోర్ట్ వచ్చిందని.. దానిపై ప్రభుత్వం లీగల్ ఒపినియన్ తీసుకుంటున్నదని చెప్పారు.  కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోందన్నారు.  

ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ విషయంలో జాగ్రత్తగా ముందుకు..

రాష్ట్రంలో డిసెంబర్‌‌‌‌ నెల నుంచి రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ రంగం పుంజుకుంటోందని మంత్రి చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం ఒకటి, రెండు శాతం పెరిగినా తమ అంచనాలకు తగినట్టు రావడం లేదన్నారు.  ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ విషయంలో జాగ్రత్తగా ముందు కెళ్లాల్సి ఉంటుందని, అందుకే జాప్యం జరుగుతోంద న్నారు. మొత్తం 25లక్షల దరఖాస్తుల్లో 4.5 లక్షల వరకు పరిష్కరించామని, మిగిలిన దరఖాస్తుల పరిష్కారం కోసం త్వరలోనే స్పెషల్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ నిర్వహిస్తామని తెలిపారు.  

ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన 81లక్షల దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియ 85 శాతం పూర్తయిందని, ఆ వివరాల కంప్యూటరీకరణ జరుగుతోందన్నారు. సంక్రాంతికి ముందు లేదా తర్వాత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. 

సిరిసిల్ల భూముల అన్యాక్రాంతంలో అధికారులపై వేటు

సిరిసిల్ల జిల్లాలో అన్యాక్రాంతమైన భూముల విషయంలో ఇప్పటికే ఆరు ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లు నమోదయ్యాయని, కొందరిని అరెస్టు చేశారని తెలిపారు.  ఆ జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని కలెక్టర్‌‌‌‌ చెప్పినప్పుడు లోతుగా విచారణ చేయాలని చెప్పానే తప్ప 2వేల ఎకరాల వరకు అక్రమాలు జరిగాయని తాను కూడా ఊహించలేదన్నారు. తప్పు జరిగింది కనుకనే ఒకరు భూమిని వెనక్కి ఇచ్చారని.. సొంత భూమి అయితే ఒక గజం కూడా ఎవరూ వదులుకోరని అన్నారు.